రికార్డు బుక్‌లోని 'మూన్‌వాక్' !

30 Aug, 2015 04:09 IST|Sakshi
రికార్డు బుక్‌లోని 'మూన్‌వాక్' !
  • మైకేల్ జాక్సన్ రికార్డును బద్దలుకొట్టిన పాలమూరు కుర్రాడు
  •      గంటలో 4.2 కి.మీ. దూరం 'మూన్‌వాక్'
  •  జడ్చర్ల: ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్ మైకేల్ జాక్సన్ మూన్‌వాక్‌తో సృష్టించిన గిన్నిస్ బుక్ రికార్డును తెలంగాణ యువకుడు బ్రేక్ చేశాడు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో నిర్వహించిన మూన్‌వాక్ ఈవెంట్‌లో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి వంశీ కృష్ణ గంట వ్యవధిలోనే 4.238 కిలోమీటర్లు దాటి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. 2002లో జాక్సన్ తన కాళ్ల మునివేళ్లతో వివిధ నృత్యరీతుల్లో వెనక్కి తిరిగిచూడకుండా గంట వ్యవధిలో 2.4 కి.మీ. మూన్‌వాక్ చేసి రికార్డు బద్దలు కొట్టాడు.

    గిన్నీస్ వారు పరిశీలించిన అనంతరం ఈ రికార్డు ను ధ్రువీకరీంచాల్సి ఉంటుంది. అయితే వంశీకృష్ణ కేవలం 33 నిమిషాల 4 సెకన్ల వ్యవధిలోనే 2.4 కి.మీ. దాటి రికార్డును తిరగరాశాడు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీనాథాచారి గిన్నిస్‌బుక్ నిర్వాహకులుగా వ్యవహరించారు. సరిగ్గా మధ్యాహ్నం 3.11 గంటలకు మూన్‌వాక్ ప్రారంభించిన వంశీకృష్ణ 4.11 గంటలకు ముగించాడు. అనంతరం వంశీ కృష్ణ మాట్లాడుతూ.. తాను మైకేల్ జాక్సన్‌కు వీరాభిమానినని, దీనికోసం ఎంతో సాధన చేశానని తెలిపారు. శనివారం జాక్సన్ జయంతి రోజున ఆయనకు ఇది తాను ఇచ్చిన నివాళి అని పేర్కొన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడుకు చెందిన వంశీకృష్ణ కుటుంబం రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో స్థిరపడింది. రికార్డు సృష్టించిన వంశీకృష్ణను మంత్రి సి.లక్ష్మారెడ్డి అభినందించారు.

మరిన్ని వార్తలు