ఉసురు తీస్తుండ్రు

25 May, 2018 09:01 IST|Sakshi
ఎల్లూరు వద్ద టిప్పర్‌ బోల్తా పడ్డ సంఘటనలో చెల్లాచెదురుగా పడిన కార్మికులు (ఫైల్‌) 

సాక్షి, నాగర్‌కర్నూల్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పనిచేస్తున్న కార్మికులకు భద్రత పూర్తిగా కరువైంది. ఇక్కడ పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు రాష్ట్రాలు దాటి వచ్చిన కార్మికులు ఇక్కడి కాంట్రాక్టు కంపెనీల బాధ్యులు, అధికారుల నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్నారు. సరిగ్గా ఆరు నెలల క్రితం ఫిట్‌నెస్‌ లేని టిప్పర్‌ బోల్తా పడగా అందులో ప్రయాణిస్తూ నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను తేలిగ్గా తీసుకున్న జిల్లా అధికారులు జరిగిన వాస్తవాలను కప్పిపుచ్చి టిప్పర్‌ బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయంటూ దాటవేశారు. అదే తరహాలో తాజాగా బుధవారం ఎల్లూరు సొరంగం పనుల్లో పేలుడు సంభవించి ఇద్దరు ఇతర రాష్ట్రాల కార్మికులు ప్రాణాలను వదిలారు.

మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిర్వహణ లోపంతో జరుగుతున్న వరుస ప్రమాదాలకు ఇక్కడి అధికారులు ఏదో ఒక సాకు వెతికి తమ నిర్లక్ష్యాన్ని దాచేస్తూ.. కాంట్రాక్టు కంపెనీలకు వత్తాసు పలుకుతుండడం విమర్శలకు తావిస్తోంది. తాజా ఘటనలో ప్రమాదం జరిగిన కొద్ది క్షణాల్లోనే జిల్లా ముఖ్య అధికారులు ప్రమాదానికి కారణం పిడుగుపాటు అంటూ తేల్చి చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందుకు సంబంధించి నిపుణులతో విచారణ చేయించకుండానే సొంత అభిప్రాయాన్ని వాస్తవంలా వెల్లడించారు. మరోపక్క ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా ఇప్పటి వరకు పరిశీలించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇతర రాష్ట్రాల కార్మికుల విషయంలో గోప్యత 
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగ నిర్మాణ పనులను చేపడుతున్న నవయుగ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ పేలుడు పదార్థాలను అమర్చేందుకు నిపుణులైన కార్మికులను ఒడిశా, చత్తీస్‌ఘడ్, బీహార్‌ రాష్ట్రాల నుంచి రప్పించింది. వీరికి రోజువారీ కూలి చెల్లిస్తూ ప్రమాదకర పరిస్థితుల మధ్య పనులు చేయించుకుంటున్నారు. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంతోపాటు వీరి కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి చెందిన సొరంగం పనుల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను సదరు ఏజెన్సీ గోప్యంగా ఉంచుతోంది.

ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా అధికారులు అడిగిందే తడవుగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ మేరకు పనుల ప్రదేశాన్ని కార్మిక శాఖ అధికారులు సందర్శించి తగిన భద్రతా సూచనలు చేయాల్సి ఉంది. వీరందరికీ గుర్తింపు కార్డులను అందజేయడంతోపాటు ఇతర రాష్ట్రాల కార్మికులకు ఇచ్చే అదనపు సౌకర్యాలను కాంట్రాక్టు కంపెనీ నుంచి ఇప్పించాల్సి ఉంటుంది. కానీ బడా కాంట్రాక్ట్‌ కంపెనీ కావడంతో అటువైపు కన్నెత్తి చూసే సాహసం కూడా అధికారులు చేయలేకపోతున్నారు. దీంతో ఈ అంశాలను ప్రశ్నించేందుకు వెళ్లిన పాత్రికేయుల పట్ల కూడా కంపెనీల బాధ్యులు దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాకు చెందిన ఓ బడా నేత అన్ని తానే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో వారు ఏం చేసినా చెల్లుబాటవుతోందని స్పష్టమవుతోంది. 

ఒక్కో ఘటనలో ఒక్కో తీరు 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకోల్‌ సమీపంలో ఇటీవల కూలీలను తీసుకెళ్తున్న జీపు ప్రమాదానికి గురైంది. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు ఆ జీపు యజమానితో పాటు డ్రైవర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి వారిని జైలుకు పంపించారు. అదే సమయంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల సమీపంలో పంపుహౌజ్‌ వద్ద టిప్పర్‌ బోల్తా పడి నలుగురు మరణించారు. పది మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. ఈ సంఘటనలో మాత్రం జిల్లా అధికారులు ప్రమాదానికి వాహనం బ్రేకులు ఫెయిల్‌ కావడమే కారణమంటూ సాంకేతిక అంశాన్ని జోడించి కేసును నిర్వీర్యం చేశారు. టిప్పర్‌ యజమానిపై కానీ పనులు జరుగుతున్న కంపెనీపై కఠినంగా వ్యవహరించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. 

చేతులెత్తేస్తున్న పోలీసులు 
జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో రోజుకో చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. వట్టెం రిజర్వాయర్‌ పనుల్లో ఓ టిప్పర్‌ దహనమైన సంఘటనలో డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. మరో సంఘటనలో కంపెనీ సూపర్‌వైజర్‌ టిప్పర్‌ కింద పడి మరణించాడు. ఎల్లూరు వద్ద మరో కార్మికుడు టిప్పర్‌ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఇలా ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. సామాన్యులపై కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు బడా బాబుల విషయంలో మాత్రం మెతకతనం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. 

మరిన్ని వార్తలు