స్నాతక సంబురం

3 Mar, 2019 07:52 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఉన్నత విద్యా ప్రదాయినీ అయిన పాలమూరు యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ (కాన్వకేషన్‌) కార్యక్రమానికి సిద్ధమవుతోంది. మొదటి స్నాతకోత్సవం 2014లో నిర్వహించగా, ప్రస్తుతం రెండో స్నాతకోత్సవం నిర్వహించేందుకు పీయూ అతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పీయూ పరిధిలో ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సులు పూర్తి చేసి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 6న జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్, పట్టాల ప్రదానోత్సవం చేస్తారు.

అతిథిగా గవర్నర్‌ రాక 
రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా రానున్నారు. వీరితో పాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులను సైతం అధికారులుఆహ్వానించారు. యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం  స్నాతకోత్సవం నిర్వహించి ఆ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడం ఆనవాయితీ. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పదేళ్ల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

చకచకా సాగుతున్న పనులు 
స్నాతకోత్సవ కార్యక్రమానికి యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వివిధ అంశాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో ఐదు మంది సభ్యుల చొప్పున ఎంపిక చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. గోల్డ్‌మెడల్స్, సర్టిఫికెట్ల నిర్వహణ, స్టేజ్‌ అతిథుల సీట్ల కేటాయింపు, పార్కింగ్, సీటింగ్, ఫైనాన్సరీ కమిటీల ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గోల్డ్‌మెడల్స్‌ తీసుకునే 115 మంది విద్యార్థులకు పీయూ అధికారులు 6న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ఫోన్‌ ద్వారా, మెయిల్, పోస్టుల ద్వారా సమాచారం అందించారు. ఇందులో 30 మంది విద్యార్థులు ముందే కాన్వకేషన్‌ సర్టిఫికెట్లు తీసుకెళ్లగా తాజాగా 62 మంది విద్యార్థులు దరఖాస్తు  చేసుకున్నారు. అంతేకాకుండా శనివారం వరకు 76 మంది విద్యార్థులు యూనివర్సిటీలో రిపోర్టు చేసి స్నాతకోత్సవానికి సంబంధించి పాస్‌లు తీసుకెళ్లారు.

అభివృద్ధి ఆశలు 
యూనిర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవానికి గవర్నర్‌ నరసింహన్‌తో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ, యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆహ్వానించారు. అయితే వీరు పీయూలో ఉన్న పలు సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అటు  విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు, పీయూ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పీయూలో ప్రస్తుతమున్న బాలికల హాస్టల్‌లో దాని పరిమితికి మించి విద్యార్థులు ఉంటున్నారు.

ప్రత్యేకంగా ఒక భవనం అవసరం కాగా పీయూలో ఉంటున్న దాదాపు 1500 మంది విద్యార్థులకు వైద్యసేవలు అందించేం దుకు ప్రత్యేక హాస్పిటల్‌ను ఏరా>్పటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా క్రీడలకు ప్రత్యేక మైదానం, పూర్తిస్థాయిలో ఇంటర్నెట్‌ సదుపాయం అవసరం. ప్రస్తుతం ఎగ్జామినేషన్‌ బ్రాంచ్, గెస్ట్‌హౌస్, వీసీ గృహం వంటి వాటి పనులు కొనసాగుతున్నాయి. వీటికి పూర్తి స్థాయిలో నిధులు అవసరం. అంతేకాకుండా గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌ పీజీ సెంటర్లలో పలు కళాశాలలు, హాస్టల్‌ భవనాలను అధికారులు నిర్మించ తలపెట్టారు. వీటికి నిధులు అవసరం. వీటిపై మంత్రులు అధికారులు దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. 

ఏర్పాట్లు చేస్తున్నాం.. 
యూనివర్సిటీలో ఈనెల 6న నిర్వహించే స్నాతకోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. గవర్నర్‌తోపాటు, మంత్రులు కూడా అతిథులుగా విచ్చేస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి బంగారు పతకాలను అందిస్తాం. ఎంపకైన విద్యార్థులందరికీ సమాచారం చేరవేశాం. – ప్రొఫెసర్‌ రాజరత్నం, పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌
 
కమిటీలు ఏర్పాటుచేశాం 
రెండో స్నాతకోత్సవానికి పనులు పూర్తికావచ్చాయి. నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశాం. వారి ఆధ్వర్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. మంచి వాతావరణంలో కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నాం. – ప్రొఫెసర్‌ గిరిజ, పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌

మరిన్ని వార్తలు