'పల్లెప్రగతి' @ మురళీనగర్

11 Feb, 2015 05:36 IST|Sakshi
'పల్లెప్రగతి' @ మురళీనగర్

‘పల్లె ప్రగతి’ కార్యక్రమం కింద జిల్లాలోని కందుకూరు మండలం మురళీనగర్‌ను ఎంపిక చేశాం. ఈ గ్రామంలో 283 కుటుంబాలు నివసిస్తుండగా కేవలం 64 ఇళ్లలోనే మరుగుదొడ్లు  ఉన్నాయి. ఈ నెల 13న మురళీనగర్ గ్రామ ప్రజలతో సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా కౌడిపల్లిలో ముఖాముఖి నిర్వహిస్తారు. 14 నుంచి ‘పల్లె ప్రగతి’ కార్యరూపం దాల్చుతుంది. గ్రామంలో కమిటీలు ఏర్పాటుచేసి కేవలం 45 రోజుల్లోనే సంపూర్ణ పారిశుద్ధ్యం, పూర్తిస్థాయి అక్షరాస్యత, మెరుగైన ఉపాధి, సమాచార కేంద్రాల ఏర్పాటు, సాంకేతిక నైపుణ్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.  
 
- డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి
కందుకూరు:  రాష్ట్ర ప్రభుత్వం ‘పల్లె ప్రగతి’ పథకంలో భాగంగా మురళీనగర్‌ను ఎంపిక చేసిందని, గ్రామాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య సహితంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మురళీనగర్‌లో పర్యటించారు. మహిళా సంఘాలు, గ్రామస్తులతో సమావేశమై.. గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి.. ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయి.. ఇంకా ఎన్ని నిర్మించాలి వంటి అంశాలపై ఆరా తీశారు. తొలుత రెండు మరుగుదొడ్లను నమూనా కింద నిర్మించేలా పనులను ప్రారంభించారు.

అనంతరం గ్రామ మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 13న పథకాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా మెదక్ జిల్లాలో ప్రారంభించనున్నారన్నారు. ఆ తర్వాత గ్రామంలో ముందుగా వంద శాతం మరుగుదొడ్లు నిర్మించేలా చూస్తామన్నారు. సంపూర్ణ పారిశుద్ధ్యంతోపాటు ఉపాధి, ఆరోగ్యం తదితర మౌలిక సదుపాయలు కల్పిస్తామన్నారు. మరుగుదొడ్లు నిర్మాణ పనులను గ్రామ సంఘానికి అప్పగిస్తున్నామన్నారు.
 ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తే, రూ.500 లబ్ధిదారులు భరించాలన్నారు. ఆయన వెంట డీఆర్‌డీఏ ఏపీడీ ఉమారాణి, ఇబ్రహీంపట్నం క్లస్టర్ ఏసీ శరత్‌చంద్ర, ఏపీఎం కొండయ్య, స్థానిక సర్పంచ్ అమృత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు