ఆ ఆంక్షల వల్ల ఆగమవుతాం..! 

26 Oct, 2017 00:46 IST|Sakshi
బుధవారం పీపుల్స్‌ప్లాజాలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలుపుతున్న పాన్‌షాప్‌ యజమానులు

పొగాకేతర వస్తువుల విక్రయాలపై ఆరోగ్య శాఖ ఆంక్షలు  

వేలాదిమంది పాన్‌షాప్‌ యజమానుల నిరసన ర్యాలీ  

హైదరాబాద్‌: పాన్‌షాపుల్లో పొగాకేతర విక్రయాలపై ఆంక్షలు విధించడం తగదని, వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పాన్‌షాప్‌ యజమానులు ఆందోళన చేపట్టారు. ఆ నిబంధనల వల్ల జీవనోపాధి సన్నగిల్లి వేలాది మంది వీధిపాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఇక్కడ నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో పాన్‌షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేలాది మంది ర్యాలీ నిర్వహించారు. తాము విక్రయించాలనుకునే వస్తువులను ఎంపిక చేసుకునే హక్కును హరిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసిందని తెలిపారు.

పొగాకేతర ఉత్పత్తులైన బ్రెడ్డు, జ్యూస్, సాఫ్ట్‌ కూల్‌డ్రింక్‌లపై నిషేధం విధించడం వల్ల హైదరాబాద్‌లో దాదాపు ఏడువేల మంది పాన్‌షాపు నిర్వాహకులు, తెలంగాణలోని లక్షా 60 వేల మంది వ్యాపారుల కుటుంబాలు రోడ్డుపాలవుతాయని అసోసియేషన్‌ సభ్యులు అల్హాజ్‌ మొహమ్మద్‌ సలాహుద్దీన్, వాహెద్‌ హుస్సేన్, సంతోశ్, ఆనంద్, జమాలుద్దీన్‌ తెలిపారు. ఈ నిబంధనలను ఉపసంహరించుకోకపోతే ‘మా అందరికీ, మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలి’అని డిమాండ్‌ చేశారు. 

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం 
ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే సూక్ష్మ దుకాణదారులు తప్పనిసరై తమను తాము కాపాడుకోవడానికి చట్టవ్యతిరేక కార్యకలాపాల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ స్ఫూర్తికి ఆ నిబంధనలు పూర్తి వ్యతిరేకం. ఇవి శాంతియుత ఉద్యోగాలు, జీవనోపాధిపై విధ్వంసకర ప్రభావం చూపుతాయి. 
    – పాన్‌ షాప్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు రంగరాజ్‌ శంకర్‌రావు  

పాన్‌షాప్‌.. మాకు ఆధారం 
50 సంత్సరాలుగా పాన్‌షాపు ఆధారంగా జీవిస్తున్నాం. మా అన్నయ్య చనిపోయిన తరువాత నేను షాపును నిర్వహిస్తున్నాను. ఒక్క షాపుపైనే రెండు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు పాన్‌షాపుల్లో కేవలం పొగాకు ఉత్పత్తులే అమ్మాలంటే ఉపాధి లేక మా కుటుంబాలు వీధిన పడతాయి. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.  
    – మహ్మద్‌ మోయిన్, పాన్‌షాపు యజమాని, సికింద్రాబాద్‌  

మరిన్ని వార్తలు