మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక

10 May, 2014 03:00 IST|Sakshi
మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక

 సైబరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడి
 ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఆవిష్కరణ

 
సైబరాబాద్, న్యూస్‌లైన్: మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్‌‘ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం ఆనంద్ మాట్లాడుతూ...అభయ ఘటన అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ పూర్తి వివరాలను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలని మార్చి 1న నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. దీనికి స్పందించి 2 వేల మంది తమ వివరాలను పొందుపర్చుకున్నారని, వీరందరికీ ‘మై వెహికిల్ ఈస్ సేఫ్’ స్టిక్కర్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి పీఎస్‌కె వర్మ పాల్గొన్నారు.
 
నమోదు చేసుకోని వారికి జరిమానా...

కమిషనరేట్ పరిధిలో 10 వేల క్యాబ్‌ల వరకు తిరుగుతున్నట్టు గుర్తించామని, వీటిలో 2 వేల మంది మాత్రమే తమ వివరాలు పోలీసుల వద్ద నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గడువు మే 1తో ముగిసిందని, వివరాలు నమోదు చేసుకొని క్యాబ్‌లకు రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూకట్‌పల్లి ట్రాఫిక్ ఠాణాలో క్యాబ్ డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.
 
స్టిక్కర్‌లో పూర్తి వివరాలు....
 
సైబరాబాద్ పోలీసులు జారీ చేస్తున్న ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్‌లో క్యూ ఆర్ కోడ్ (క్విక్ రె స్పాన్స్ కోడ్). అందులో క్యాబ్ యజమాని, డ్రైవర్ వివరాలు, క్యాబ్‌కు సంబంధించిన పత్రాల పూర్తి వివరాలు ఉంటాయి. స్టిక్కర్‌పై వాహనం, దానికి కేటాయించిన ఐడీ నెంబర్‌లను పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేశారు. ఈ స్టిక్కర్ల గడువు ఏడాది ఉంటుంది. ఆపై రెన్యూవెల్ చేసుకోవాలి.
 
స్టికర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలి...
 
సైబరాబాద్ పరిధిలో క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినిలు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఉన్న వాటిలోనే వెళ్లాలని కమిషనర్ కోరారు. క్యాబ్ ఎక్కే ముందు స్టిక్కర్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలన్నారు. కాగా,  ఓ క్యాబ్ డ్రైవర్- ‘సార్....మేం తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు సరే....మమ్మల్ని క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు వేధిస్తే ఏం చేయాలని అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఫిర్యాదు చేస్తే ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు.

>
మరిన్ని వార్తలు