మళ్లీ.. మొదటికి!

27 Oct, 2018 09:58 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా మళ్లీ మొదటికొచ్చి నట్లే కనిపిస్తోంది. పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాపై కసరత్తు ప్రారంభించింది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగానే మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పంచాయతీ ఓటర్ల జాబితాపైన జిల్లా పంచాయతీ విభాగం దృష్టి సారించింది. తాజాగా ప్రకటించిన అసెంబ్లీ ఓటరు జాబితాకు, గతంలో పంచాయతీ ఎన్నికల కోసం విడుదల చేసిన ఓటరు జాబితాకు మధ్య వ్యత్యాసం ఎంత ఉన్నదో తెలియజేయాలని జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయని సమాచారం.

ఎన్నికల సంఘం కోరిన సమాచారం మేరకు... అసెంబ్లీ ఓటర్లకు, పంచాయతీ ఓటర్లకు మధ్య వ్యత్యాసం స్వల్పంగా ఉన్నట్లయితే అసెంబ్లీ ఓటరు జాబితాకు అనుబంధ జాబితా జత చేస్తారని అంటున్నారు. ఆ రెండు జాబితాల మధ్య వ్యత్యాసం భారీగా ఉన్నట్లయితే మళ్లీ ఓటరు నమోదుకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల వ్యత్యాసంతో పాటు, జిల్లా పంచాయతీ అధికారుల అభిప్రాయాన్ని కూడా ఎన్నికల సంఘం కోరింది. ఈ మేరకు అధికారులు కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయాలన్న అభిప్రాయమే వ్యక్తం చేశారని తెలిసింది. మే నెలలో ప్రకటించిన పంచాయతీ ఓటర్ల జాబితాకు, అసెంబ్లీ ఓటర్ల జాబితాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతోపాటు, పోలింగ్‌ స్టేషన్ల నంబర్లు కూడా తారుమారయ్యాయని సమాచారం. దీంతో తప్పనిసరిగా నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.

జిల్లాకో రెండు గ్రామాల ఎంపిక
ఓటర్ల సంఖ్యలో ఎంత వ్యత్యాసం ఉన్నదో తెలుసుకునేందుకు జిల్లాకో రెండు గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆ గ్రామాల్లో పాత పంచాయతీ ఓటర్లు, ప్రస్తుత అసెంబ్లీ ఓటర్ల సంఖ్య మధ్య తేడాను గుర్తించమన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో అనుమల మండలం పేరూరు, నకిరేకల్‌ నియోజకవర్గంలో కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్‌ పంచాయతీలను పైలెట్‌గా తీసుకున్నారు. ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన పంచాయతీ ఓటర్ల ప్రకారం పేరూరు గ్రామంలో మొత్తం ఓటర్లు 685 మంది ఉన్నారు. పోలింగ్‌ స్టేష¯న్‌ నంబరు 126. ఇక, అసెంబ్లీ తాజా ఓటరు జాబితా ప్రకారం అదే గ్రామంలో ఓటర్ల సంఖ్య 714కు పెరిగింది. 29 మంది ఓటర్లు అదనంగా చేరారు.

అలాగే పోలింగ్‌ స్టేషన్‌ నంబరు కూడా 136గా మారింది. ఉప్పలపహాడ్‌లో పంచాయతీ ఓటర్లు 820 మంది. అసెంబ్లీ తాజా ఓటర్ల లెక్కల ప్రకారం ఆ గ్రామంలో ఓటర్లు 939. అంటే కొత్తగా 119 మంది ఓటర్లు చేరారు. పోలింగ్‌ స్టేషన్‌ నంబరు 263 ఉండగా, కొత్త పోలింగ్‌ స్టేషన్‌ నంబరు 276గా మారింది. ఇలాంటి మార్పులే దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఉంటాయని అధికారులు అంటున్నారు. ఓటర్ల సంఖ్యతోపాటు, పోలింగ్‌ స్టేష¯న్‌ నంబర్లు కూడా మారుతున్నందున కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయక తప్పదని అంటున్నారు.

బ్యాలెట్‌ పత్రాలు బూడిదే 
గ్రామ పంచాయతీ  పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు ఒకటికి నాటికి ముగిసింది. జూలై నెలలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల్లో బ్యాలెట్‌ పత్రాలను ముద్రించింది. అయితే పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో జరిగితే ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలు వినియోగించుకునే వీలుందని, అలా కాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తే 2018తో ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలను బూడిద చేయక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.

బ్యాలెట్‌ పత్రాల ముద్రణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్‌ పేపరుకు అయ్యే ఖర్చు రూ.లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వమే నేరుగా బ్యాలెట్‌ పేపరు కోసం టెండర్‌ పిలుస్తుంది. ఆ పేపరు జిల్లాలకు పంపిస్తే అవసరం మేరకు సర్పంచులు,  వార్డు సభ్యుల గుర్తులు ముద్రిస్తారు. ఎన్నికలు వాయిదా పడడంతో అప్పట్లో ముద్రించిన బ్యాలెట్‌ పేపర్లు అన్నీ గోదాముల్లో భద్రపర్చారు. జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యులకు కలిపి 22 లక్షల బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు. ముద్రణకు రూ.9లక్షలు ఖర్చయ్యింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 9.50లక్షల బ్యాలెట్‌పత్రాలు ముద్రించగా, దీనికి రూ.3లక్షలు ఖర్చయ్యింది. ముద్రించిన బ్యాలెట్‌ పత్రాలను ఓ ప్రైవేటు గోదాంలో భద్రపరచగా, ఆ గోదాముకు నెలకు రూ.10వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా