ఇప్పుడైనా సరిచేస్తారా?

28 Dec, 2018 07:56 IST|Sakshi

బోథ్‌: రాష్ట్రంలో జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు సన్నద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో పౌరులు పోటీ పడతారు. పట్టణాల్లో ఉన్నవారు సైతం వ్యయప్రయాసాలకోర్చి తమ సొంత గ్రామాలకు చేరుకుని ఓటు వేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో కంగు తిన్నారు. స్థానికంగా ఉండే వారి పేర్లు సైతం తొలగించారు. పోలింగ్‌  కేంద్రాల వద్దకు ఓటేసేందుకు వచ్చిన పలువురు ఓటరు జాబితాల్లో పేర్లు లేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలతోపాటు పార్లమెంట్‌ ఎన్నికలను దష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించే దిశగా ప్రయత్నిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ముప్పు తప్పుతుంది. ముసాయిదా ఓటరు జాబితా సవరణలో కీలకంగా వ్యవహరించాల్సిన బీఎల్‌వోలు విధులు సక్రమంగా నిర్వహించకనే ఈ పరిస్థితి తలెత్తుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
   
చేయాల్సింది ఇలా.. 
పోలింగ్‌ కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు తొలగింపులో బీఎల్‌ఓలు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముసాయి దా ఓటరు జాబితా సవరణ సమయంలో బూత్‌ లెవల్‌ అధికారి ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదుపై చైతన్యం కల్పించాలి. జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగించాలంటే నోటీసు ఇచ్చి విచారణ జరపాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పేరు తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటరు నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ చేపడతారు. ఆ సమయంలో బీఎల్‌ఓలు స్థానికం గా అందుబాటులో ఉండి అర్హులైన వారి పేర్లు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలి.

చేస్తున్నారిలా.. 
బీఎల్‌ఓలు స్థానికంగా ఉండకపోవడంతో స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే ఓట్ల తొలగింపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓటరు జాబితాలో ఒక్కసారి పేరు నమోదైతే తొలగించాలంటే తప్పనిసరిగా ఆ ఓటరు సమీప ఇంటి యజమానుల నుంచి వివరణ తీసుకోవాలి. తర్వాత తొలగాంచాలని నిబంధనలు చెబుతున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయంతోపాటు ఇంటర్‌నెట్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బీఎల్‌ఓలు తిరస్కరిస్తున్నారు. దీంతో అన్ని అర్హతలుండి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు నమోదు కాకపోవడం గమనార్హం.

పర్యవేక్షణ అవసరం.. 
బీఎల్‌ఓల పనితీరు పర్యవేక్షించడంతోపాటు పారదర్శకంగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు తహసీల్దార్‌ నుంచి జిల్లా అధికారుల వరకు పర్యవేక్షణ అవసరం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు నమోదు కోసం పలు స్వచ్ఛంద సంస్థలు యువతతోపాటు అర్హులైన వారందకూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఫారం–6 పంపిణీ చేసి దరఖాస్తు చేయించారు. రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తులను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. కానీ చాలా మంది పేర్లు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఓటు హక్కును కోల్పోయారు. ట్యాబ్‌లల్లో చిరునామాలు కూడా అప్‌లోడ్‌ చేయకపోవడంతో బీఎల్వోలకు చిరునామాలు దొరకక వాటిని తిరస్కరించారు. వీటన్నింటినీ పర్యవేక్షించి లోటు పాట్లను సరిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొత్తగా ఓటరు     నమోదుకు అవకాశం 
కొత్త ఓటర్లు, ఓట్లు గల్లంతైన వారికోసం ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ అభ్యర్థులు నామినేషన్‌ వేసే రెండు రోజుల ముందు వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గల్లంతైన వారు, కొత్త ఓటరు నమోదు చేయదలచిన వారు, మార్పులు, చేర్పుల కోసం బీఎల్‌ఓలను సంప్రదించాలని అధికారులు పేర్కొంటున్నారు.  

నా ఓటు తీసేశారు.. 
ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో  ఓటు వేశాను. కానీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. నా ఓటు తీసేశారు. ఎలా తీసేశారని అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. దీన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నా. అధికారుల తప్పిదం వల్ల చాలా మంది తమ ఓటును వేయలేకపోయారు.  – రామాయి నారాయణ, సొనాల 

మరిన్ని వార్తలు