పంచాయతీ ‘కోడ్‌’ పల్లెలకే..

8 Jan, 2019 02:10 IST|Sakshi

పట్టణాల్లో అమలు కాదు 

నిబంధనల్లో సవరణ  

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల ప్రవర్తనానియమావళిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కానుంది. ఇది పట్టణ ప్రాంతాలకు వర్తించదు. ఈ మేరకు ప్రవర్తనానియమావళిని సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మునిసిపాలిటీలకుగానీ, గ్రామపంచాయతీలకు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తే నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాష్ట్రం అంతటా ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లో ఉంటుంది. తాజాగా చేపట్టిన సవరణల ప్రకారం మునిసిపాలిటీలు లేదా గ్రామ పంచాయతీలకు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తే సంబంధిత పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి రానుంది.  

సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులు అర్హులే.. 
ఆర్టీసీ, సింగరేణి సంస్థల్లో పనిచేస్తున్న మేనేజింగ్‌ ఏజెంట్, మేనేజర్, సెక్రటరీ హోదా కలిగిన అధికారులు మినహా మిగిలిన ఉద్యోగులందరూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఈ సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వవాటాల మొత్తంతో నిమిత్తం లేకుండా ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులేనని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ ఆదివారం వివరణ ఇచ్చారు.  

రైతులకు రూ.5 భోజనానికి అనుమతి నో.. 
మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు రూ.5 కు భోజనం అందించడంతోపాటు మార్కెట్‌కు వచ్చేవారికి వైద్యసేవలందించేందుకు వైద్యుడి నియామకం, మందుల కొనుగోలుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. కార్యక్రమాలకు అనుమతి కోరుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి లేఖ రాయగా, పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు ఈ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని ఎన్నికల సంఘం బదులిచ్చింది.   

మరిన్ని వార్తలు