‘పంచాయతీ’ ఆపలేం

4 Jan, 2019 04:30 IST|Sakshi

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినందున జోక్యం చేసుకోలేం

తేల్చిచెప్పిన హైకోర్టు ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయినందున ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ చట్టబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాల్లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతంగా ఖరారు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 15న తీసుకొచ్చి న ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ మహాజన సమితి ప్రతినిధి యు. సాంబశివరావు (ఉసా), తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రిమండలి లేకుండా ఆర్డినెన్స్‌ జారీ చేయడం చెల్లదని, అందువల్ల దీన్ని రద్దు చేయాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సామల రవీందర్‌ మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. 

రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు
ఉసా, జాజుల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.జి. కృష్ణమూర్తి వాదిస్తూ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించి బీసీ జనాభాను, ఓటర్లను తేల్చలేదని, ఆర్థిక, గణాంక డైరెక్టరేట్‌ ఇచ్చిన గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందన్నారు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 243 (డీ) కింద రిజర్వేషన్లు కల్పించేందుకు అడ్డంకులేవీ లేవన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని వ్యాఖ్యానించింది.

తరువాత కృష్ణమూర్తి వాదనలు కొనసాగిస్తూ గతంలో పంచాయతీరాజ్‌ చట్టం కింద బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవని, ఇప్పుడు చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్‌ ద్వారా వాటిని కుదించారన్నారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించరాదని ప్రభుత్వం వాదిస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగానే ఆర్డినెన్స్‌ తెచ్చిందని వివరించారు. నిమ్మక జయరాజ్‌ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న నిబంధనను సుప్రీంకోర్టు పక్కనపెట్టిందని, దీని ఆధారంగానే బీసీలకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదని ఆయన గుర్తుచేశారు. 

లెక్కలు సేకరించాం...
అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) వాదిస్తూ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని, తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఆర్డినెన్స్‌ తెచ్చామని ధర్మాసనానికి వివరించారు. ఈ సమయంలో కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ బీసీ జనాభా, బీసీ ఓటర్ల లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఆ లెక్కలు తేల్చలేదని, అందుకే దానిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలైందన్నారు.

ప్రభుత్వ ఆర్డినెన్స్‌ వల్ల బీసీ రిజర్వేషన్లు 22 శాతానికే పరిమితం అవుతున్నాయన్నారు. దీనిపై ఏఏజీ స్పందిస్తూ నిబంధనల మేరకు బీసీ లెక్కలు సేకరించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా రూపొందించామన్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా జారీ అయిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయినందున పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆర్డినెన్స్‌ చట్టబద్ధతపై మాత్రం తేలుస్తామని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు