పురపాలికల్లో రిజర్వేషన్ల సందడి

24 Dec, 2018 12:26 IST|Sakshi

మున్సిపాలిటీల్లో ప్రారంభమైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన

అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఇది కొనసాగుతుండగానే మున్సిపాలిటీల్లో జరగబోయే ఎన్నికల కోసం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలకు జూన్‌ వరకు సమయం ఉన్నా అప్పటిలోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటర్ల గణన ప్రారంభించారు. 

నల్లగొండ : జిల్లాలో కొత్త వాటితో కలుపుకొని 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ మున్సిపాలిటీలు పాతవి కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాలియా, నందికొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటిని నగర పంచాయతీలనుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసింది.

నకిరేకల్‌ మున్సి పాలిటీలో అప్పట్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా జరిగినందున 2020 వరకు అక్కడ పంచాయతీ పాలన కొనసాగనుంది. మిగిలిన మున్సిపాలిటీలకు పాలక వర్గాల కాల పరిమితి జూన్‌ వరకు ఉంది. మిగతా వాటిలో ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ ఆలోగా వార్డుల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ,మహిళా ఓటర్లను గుర్తించాలనేది ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే ఓటర్ల గణన ప్రారంభించింది.

29వ తేదీ వరకు గణన
ఈనెల 23న వార్డుల వారీగా  ప్రారంభమైన ఓటర్ల గణన 29వ తేదీ వరకు కొనసాగనుంది. 29, 30న ఓటర్ల జాబితా తయారీ, జనవరి 1వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటన, 2 నుంచి 4 తేదీల మధ్య ఆ జాబితాపై ఫిర్యాదులను స్వీకరించనున్నారు. 5, 6 తేదీల్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు మహిళా ఓటర్లను గుర్తిస్తారు. 7,8 తేదీల్లో తుది జాబితా తయారు చేస్తారు. 9వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా ప్రకటన, జనవరి 10వ తేదీన తుది జాబితాను సమర్పించనున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40 వార్డులు ఉండగా, మిర్యాలగూడలో 36, హాలియా, నందికొండలో 9 వార్డుల చొప్పున ఉన్నాయి. అదే విధంగా దేవరకొండలో 20 వార్డులుండగా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలలో 7 చొప్పున వార్డులున్నాయి.

ప్రారంభమైన ఓటర్ల గణన
అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల గణన ప్రారంభమైంది. ఒక్కో వార్డుకు మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్‌ ఇన్‌చార్జ్‌గా, వారికి సహాయకులుగా బీఎల్‌ఓ లేదా అంగన్‌వాడీ టీచర్‌ను ఉంచుతున్నా రు. పూర్తిస్థాయిలో బిల్‌ కలెక్టర్‌ లేని చోట ము న్సిపల్‌ ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా ఉంచి ప్రతి వార్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్లను విభజించి ఆయా వార్డుల్లో గణన ప్రారంభించారు.
 
ఓటర్ల గుర్తింపు ఇలా....
బీసీ,ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గణన జరిపే సందర్భంలో ఆ ఇంటికి సంబంధించిన వారు బీసీ అయితే బ్లాక్‌ పెన్‌తో మార్క్‌ చేయాల్సి ఉంటుంది. ఎస్టీ అయితే గ్రీన్‌ పెన్‌తో, ఎస్సీ అయితే రెడ్‌ పెన్‌తో మార్క్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో అధికారి మూడు పెన్నులతో వెళ్లి కేటగిరీల వారీగా గణన చేయాల్సి ఉంది. మహిళలు ఉంటే మహిళలు ఉన్నచోట ఆ అంకెకు రౌండ్‌ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎవరెవరు ఎంతెంత మంది అనేది సులభంగా తెలిసిపోతుంది.
 
ఏ రోజుది అదే రోజు అప్పగింత
ఓటర్ల గుర్తింపుకు సంబంధించి ఆయా మున్సిపల్‌ ఉద్యోగి ఏ రోజు చేసిన గణన అదే రోజు మున్సిపల్‌ కమిషనర్, సహాయ కమిషనర్‌కు అప్పగించాలి. సాయంత్రం 5గంటలకు ఆ రోజు వార్డుల్లో ఎంత వరకు ఓటర్ల గణన జరిగిందో లెక్క తేల్చాలి.

గణన ఆధారంగానే రిజర్వేషన్లు
మున్సిపల్‌ ఉద్యోగులు నిర్వహించే వార్డుల వారీగా ఓటర్ల గణన ఆధారంగానే ఆ వార్డు రిజర్వేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా కేటగిరీలో ఉంటారో దానిని బట్టి రిజర్వేషన్‌ను నిర్ణయిస్తారు. గణన ప్రారంభం కావడంతో తాజా మాజీ కౌన్సిరల్లతో పాటు పోటీ చేయాలనుకునే వారు తమ వార్డులో ఏ కేటగిరీలో వారు ఎక్కువగా ఉన్నారనేది అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి మున్సిపల్‌ ఎన్నికలు జూన్‌ వరకు గడువు ఉన్నా మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల సందడి నెలకొన్నట్లుగా ఉంది. ఏ వార్డు ఏ వర్గానికి రిజర్వేషన్‌ అవుతుందోననే ఉత్కంఠతతో ఆశావహులు ఉన్నారు.

మరిన్ని వార్తలు