మచ్చికకే మొగ్గు.

12 Jan, 2019 11:23 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పంచాయతీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారాయి. పోటీ ఉన్నచోట ఏకగ్రీవాలు చేసేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నా పెద్ద నాయకులను మచ్చిక చేసుకుంటు న్నారు.  పార్టీల కతీతంగా పోటీ ఉన్న వారిని బుజ్జగిస్తున్నారు.  ఇక గులాబీ బాస్‌ కేటీఆర్‌ వీలైనంత ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో ఎలాగైనా అధికార పార్టీవే ఎక్కువ స్థానాలు ఉండేందుకు శాసనసభసభ్యులు పొద్దనకా.. రాత్రనకా కష్టపడుతున్నారు.

ఏ విధంగానైనా అభ్యర్థులను ఉపసంహరించే విధంగా చేసి ఎక్కువ ఏకగ్రీవాలు చేయించిన ఘనత ఉండాలని పాకులాడుతున్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు గ్రామ ప్రథమ పౌరుడి పీఠాన్ని దక్కించుకునేందుకు పోటీ నుంచి తప్పుకునే పరిస్థితి కనిపించడంలేదు. కొత్త జీపీలు ఏర్పాటు కావడం వల్ల మొదటి సర్పంచ్‌గా గెలిస్తే చిరస్థాయిగా మొదటి సర్పంచ్‌ పేరు ఉంటుందని ప్రలోభాలకు లొంగకుండా పోటీలో ఉండేందుకు నిర్ణయించుకున్నవారు ఉన్నారు. అలాంటి వారి బలహీనతలను ఆసరాగా తీసుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన అభ్యర్థుల ఉపసంహరణ, ఎన్నికలు తదితర అంశాలపైనే చర్చ కొనసాగుతుంది.

ఉమ్మడి వరంగల్‌లో 58 గ్రామాలు ఏకగ్రీవాలు..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తొలి దశలో 608 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 58 గ్రామ పంచాయతీల్లో ఒకొక్కరే నామినేషన్లు వేశారు. దాదాపు ఈ 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైట్టే. అధికారులు ప్రకటించాల్సి ఉంది. వరంగల్‌ అర్బన్‌లో 5, వరంగల్‌ రూరల్‌లో 21, జయశంకర్‌ భూపాలపల్లిలో 13, మహబూబాబాద్‌లో 10, జనగామలో 9 గ్రామ పంచాయతీల్లో ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో అధికంగా టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారులే ఉన్నారు.

అభివృద్ధిపై ఆశలు.. 
ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధి జరుగుతుంది.. అధిక నిధులొస్తాయని ఎమ్మెల్యేలు పలు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామసభలు పెట్టి మరీ వివరిస్తున్నారు. అభివృద్ధిపై ఆశలు చూపుతున్నారు. వివిధ గ్రాంట్‌ల రూపంలో వచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వివరాలు తెలుపుతున్నారు. ఏకగ్రీవం చేసే గ్రామ పంచాయతీలకు జనాభా 5 వేల లోపు ఉంటే రూ.9 లక్షలు, 5 వేల కంటే పైగా ఉంటే రూ.15 లక్షలు నజరానా అందుతుంది. ఎమ్మెల్యేల సీడీఎఫ్‌ నుంచి మరో రూ.10 లక్షలు నిధులు కేటాయిస్తామని ఇటీవల టీఆర్‌ఎస్‌ అధినేత ప్రకటించిన విషయం విధితమేనని గుర్తు చేస్తున్నారు. ఏకగ్రీవం చేస్తే ఇవన్నీ నిధులు వస్తాయని గ్రామాల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఎమ్మెల్యేలు మంతనాలు జరుపుతున్నారు.
 
రేపటి వరకు ఉపసంహరణ గడువు 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటి విడతలో 608 గ్రామ పంచాయతీలు, 5,458 వార్డులకు నామినేషన్‌ల స్వీకరణ పూర్తయింది. ఈ నెల 13వరకు నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు లేవు. గత ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసుధనాచారి, ములుగు నుంచి మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌ పోటీ చేసి ఒడిపోయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఇన్‌చార్జిలుగా కృషి చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలను ఆయా గ్రామాలకు ఇన్‌చార్జిలుగా ఏర్పాటు చేసి ఏకగీవ్రమయ్యే విధంగా చేయాలని వారికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగు, భూపాలపల్లిలను కాంగ్రెస్‌ కైవసం చేసుకోవడంతో గతంలో జరిగింది పునరవృతం కావద్దని టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మూడొంతుల గ్రామ పంచాయతీలు కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ కసరత్తు ప్రారంభించింది.

మాట వినేదెవరో.. ? 
ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో రేపు తేలనుంది. గ్రామ పంచాయతీల వారీగా అధికార పార్టీ ఎన్ని ఏకగ్రీవ జెండా ఎగుర వేస్తుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఎక్కువ గ్రామాలను ఏకగ్రీవాలు చేసి కేటీఆర్‌ దగ్గర మార్కులు కొట్టేయాలని ఎమ్మెల్యేలు చాయశక్తులా కృషి చేస్తున్నారు. విశేషమేమిటంటే అధికార పార్టీలోనే ఎక్కువమంది అభ్యర్థులు తామంటే తామని పోటీ పడడం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.  

మరిన్ని వార్తలు