జూలై నెలాఖరు కల్లా పంచాయతీ ఎన్నికలు

30 May, 2018 17:01 IST|Sakshi
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: జూలై నెలాఖరు కల్లా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. విలేకరులతో మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పెద్ద సవాల్‌తో కూడుకున్న విషయమని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న ఓటర్ల కంటే పంచాయతీ ఎన్నికల్లో రెట్టింపు సంఖ్యలో ఓటర్లు ఉన్నారని చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 30 మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చాలా సమర్థంగా ఉంటుందని అన్నారు. ఏడాది క్రితం నుంచే ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలైలోగా ఎన్నికలు పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వానికి విన్నవించారు.

ఈ రెండు నెలల్లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అలాగే ముద్రణా సామగ్రి జూన్‌ 15 నాటికి సిద్ధమవుతుందని తెలిపారు. ఓటర్ల తుది జాబితా కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. రిట్నరింగ్‌ అధికారులను గుర్తించి కలెక్టర్లు నియమించాలని సూచించారు. బ్యాలెట్‌ పత్రాలు జిల్లాలోనే ముద్రించాలని తెలిపారు.

మరిన్ని వార్తలు