పల్లెల్లో పాట్లు 

11 Feb, 2019 07:01 IST|Sakshi
లక్ష్మీదేవిపల్లిలో ఇరుకు గదిలో ఉన్న పంచాయతీ కార్యాలయం

పాల్వంచరూరల్‌: నూతన గ్రామపంచాయతీలు సమస్యల లోగిళ్లుగా మారాయి. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు లేవు. పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పలు గ్రామాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఇటీవల కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొలువుదీరినా.. అభివృద్ధి పనులు చేయడం వారికి సవాల్‌గానే మారింది. దీనికి తోడు గ్రామ కార్యదర్శుల కొరత కూడా వేధిస్తోంది. జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఉండగా.. కార్యదర్శులు 88 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఏ గ్రామంలోనూ వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు.

అభివృద్ధి కోసమే పునర్విభజన...  
చిన్న పంచాయతీలు అయితేనే అభివృద్ధి మరింతగా సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేసింది. 500 మంది జనాభా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో 203 (భద్రాచలం, సారపాక మినహా) గ్రామ పంచాయతీలు ఉండగా.. పునర్విభజన తర్వాత 479కి పెరిగింది. అన్ని గ్రామాలకు ఈనెల 2వ తేదీన కొత్త పాలకులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నాయి.

కొత్త పంచాయతీలకు భవనాలు కరువు.. 
జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన 276 గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు కరువయ్యాయి. పాత వాటిలోనూ 43 గ్రామాల్లో సరైన కార్యాలయాలు లేవు. కొత్తగా ఏర్పడిన వాటిలో 20 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం..పక్కా భవనాల నిర్మాణంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరు చేసిన నిదులను కొత్త పంచాయతీలకు కూడా జమ చేయాలని, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

వేధిస్తున్న కార్యదర్శుల కొరత... 
గ్రామ పంచాయతీల్లో  ప్రభుత్వ అధికారిగా వ్యవహరించే కార్యదర్శులు ప్రతి పంచాయతీకి ఒకరు ఉండాలి. కానీ జిల్లాలో 387 గ్రామాల్లో కార్యదర్శు లు లేరు. జిల్లా వ్యాప్తంగా 88 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కార్యదర్శులు పర్యవేక్షించాలి. వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరపరా, ఇంటి పన్నుల వసూళ్లు, జనణ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అయితే అన్ని గ్రామాల్లో కార్యదర్శులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని వార్తలు