వ్యవసాయాధికారులపై సమితుల పెత్తనం!

27 Feb, 2018 02:07 IST|Sakshi

ఏఈవో, ఏవోలపై గ్రామ, మండల సమితుల నుంచి ఒత్తిళ్లు

ఏడీఏ, డీఏవోలపై జిల్లా సమితుల నుంచి ఇబ్బందులు

రాష్ట్ర అధికారులపై మంత్రి, రాష్ట్ర సమితి అధ్యక్షుడి నుంచి సమస్య

వ్యవసాయశాఖలో రెండు అధికార కేంద్రాలపై అధికారుల్లో ఆందోళన

సాక్షి, హైదరాబాద్ ‌: వ్యవసాయాధికారులపై రైతు సమన్వయ సమితి సభ్యుల పెత్తనం మొదలు కానుందా? సమితుల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలే ఉండటంతో వారి నియంత్రణలో అధికారులు పనిచేయాల్సి రానుందా? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని వ్యవసాయశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ‘పెట్టుబడి’పథకం చెక్కుల పంపిణీ మొదలుకొని పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు సమితి సభ్యుల పర్యవేక్షణే కీలకం కానుండటంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పరిధిలో కిందిస్థాయిలో ఎవరూ రాజకీయ కార్యకర్తలు ఉండేవారు కాదు. అధికారులే కిందిస్థాయిలో పనులు చక్కబెట్టేవారు. రైతు సమన్వయ సమితిలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి సభ్యులు 1.61 లక్షల మంది ఉన్నారు. వాటికి సమన్వయకర్తలున్నారు. గ్రామస్థాయిలో 15, మండల, జిల్లా స్థాయిలో 24, రాష్ట్రస్థాయిలో 42 మంది చొప్పున సభ్యులున్నారు. ప్రతీ గ్రామ, మండల, జిల్లా సమితులకు సమన్వయకర్త ఉన్నారు. రాష్ట్రస్థాయి సమితి ఇంకా ఏర్పడాల్సి ఉంది. రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఇప్పటికే ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఒత్తిళ్లు తప్పవా?
రాష్ట్ర వ్యవసాయశాఖలో కిందినుంచి పైస్థాయి వరకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. రెండు మూడు గ్రామాలకు కలిపి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) ఉంటారు. మండల స్థాయిలో మండల వ్యవసాయాధికారి (ఎంఏవో) ఉంటారు. నియోజకవర్గం స్థాయిలో సహాయ వ్యవసాయాధికారి (ఏడీఏ), జిల్లాస్థాయిలో జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) ఉంటారు. ఏఈవోపై గ్రామ రైతు సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఇబ్బందులు తలెత్తుయని అంటున్నారు.

మండల సమన్వయ సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఎంఏవోలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఏడీఏ, డీఏవోలకు జిల్లా సమితి సభ్యులు, సమన్వయకర్తల నుంచి ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవసాయ యంత్రాల సరఫరాకు ఎంఏవో నుంచి అనుమతి అవసరం. అక్కడి నుంచే ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు ట్రాక్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పంపిణీ చేసే వరి నాటు యంత్రాల విషయంలోనూ ఇదే జరగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు సమితి సమన్వయకర్తల నుంచి కూడా పైరవీలు పెరగనున్నాయి.

అనధికారిక ప్రొటోకాల్‌
వ్యవసాయ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమం తమకు చెప్పాలని అనేకచోట్ల రైతు సమితి సమన్వయకర్తలు అంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఒకరకంగా గ్రామస్థాయి సమితి నుంచి పైస్థాయి వరకు ప్రొటోకాల్‌ ప్రకారం నడుచుకోవాలన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రస్థాయిలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నుంచి ప్రొటోకాల్‌ సమస్య ఉంటుందన్న భయాందోళనలను అధికారులు వెళ్లబుచ్చుతున్నారు.

నిరంతరం కింది నుంచి పైస్థాయి వరకు గుత్తా పరిధిలోకే వ్యవసాయ విస్తరణ వ్యవస్థ వెళుతుందని అంటున్నారు. వ్యవసాయశాఖ చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలు రైతు సమన్వయ సమితుల ద్వారానే జరుగనుండటంతో వాటికి అత్యంత ప్రాధాన్యం నెలకొంది. దీంతో రైతు సమన్వయ సమితి మరో అధికార కేంద్రంగా ఏర్పడనుందంటున్నారు. ఇది అనేక కొత్త సమస్యలను సృష్టిస్తుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు