ఈ సర్కార్‌ నౌకరీ మాకొద్దు! 

18 Sep, 2019 11:41 IST|Sakshi
పనిభారం తగ్గించాలని సోమవారం డీపీవో కార్యాలయం ఎదుటధర్నా చేసిన పంచాయతీ కార్యదర్శులు

పనిభారంతో ఇబ్బంది పడుతున్న పంచాయతీ కార్యదర్శులు 

పంచాయతీల్లో పనిచేసేందుకు నిరాసక్తి..

శిక్షణ ఇవ్వకుండా విధులు అప్పగింత 

30 రోజల ప్రణాళికతో ముప్పుతిప్పలు 

జిల్లాలో ఇప్పటికే 20 మంది రాజీనామా

పెద్దపల్లిరూరల్‌: పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాన్ని సంపాదించామన్న ఆనందాన్ని చాలా మంది ఉద్యోగులు నిలుపుకోలేక వాటికి రాజీనామాలు చేసి ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నారు. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పదవులను ప్రభుత్వం భర్తీ చేయడంతో అర్హత గల వారంతా ఆయా ఉద్యోగాలను దక్కించుకున్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం అమలయ్యే నిబంధనలు కఠినతరంగా ఉండడం, విధులు నిర్వహణలో ఒత్తిడి అధికం కావడంతో వాటిని వదులుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 263 పంచాయతీలు ఉండగా, ఇందులో 57 మంది రెగ్యూలర్‌ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీటికి తోడు 198 మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరారు. అందులో 20 మంది పంచాయతీ కార్యదర్శులు తమ అవసరాలను బట్టీ పదవులను వదులుకుంటున్నట్లు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు రాజీనామా లేఖలను సమర్పించారు.
 
ఆన్‌లైన్‌ అనుమతులతో అవస్థలు.. 
నూతన పంచాయతీరాజ్‌ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ పద్ధతినే అనుమతులు ఇవ్వాల్సి ఉండడం కూడా ఇబ్బందులకు కారణంగా పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీ జనాభా కొత్తగా ఇళ్లు నిర్మించే స్థలం తదితర వివరాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో అనుమతులను ఇవ్వాల్సి ఉంటుందని ఈ విషయమై జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా చేరిన తమకు అవగాహన పెంచేలా శిక్షణ తరగతుల ను నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నా రు. గ్రామంలో వార్డుసభ్యుడు మొదలు సర్పం చ్, ఎంపీటీసీతోపాటు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు తమ తమ అవసరాల నిమిత్తం పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడిని పెంచి తాము చెప్పినట్టే మసులుకోవాలని హుకూం జారీ చేస్తున్నారని వాపోతున్నారు.  

ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామాలు.. 
పంచాయతీరాజ్‌ కొత్త చట్టం అమలుతో బాధ్యతలు పెరగడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడిలు విపరీతంగా పెరగడంతో ఈ ఉద్యోగాన్ని వదిలి మరో ఉద్యోగం చూసుకోవడం మేలంటూ కుటుంబీకుల నుంచి సూచనలు అందుతున్న కారణంగానే పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇతర ఉద్యోగాల్లో చేరేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో అనేక రకాల సమస్యలు, సవాళ్లు ఒకేసారి చుట్టు ముట్టుతుండడంతో వాటిని తట్టుకోలేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నారని కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డ స్రవంతి ఉదంతమే ఇందుకు నిదర్శనంగా పలువురు పేర్కొంటున్నారు.  

20 మంది కార్యదర్శుల రాజీనామా... 
జిల్లాలో పంచాయతీ కార్యదర్శులుగా చేరిన వారిలో 20 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారిలో చాలా మంది ఇతర శాఖల్లో ఉద్యోగాలు రావడంతో పనిభారం అధికంగా ఉండడంతోపాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తట్టుకోలేక తమ ఉద్యోగాలను వదులుకున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి మండలంబ్రాహ్మణపల్లి, పెద్దబొంకూరు గ్రామపంచాయతీ  కార్యదర్శులతోపాటు అంతర్గాం మండలం ఎల్లంపల్లి, ఎలిగేడు మండలంలోని లాలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌ మండలం చినరాత్‌పల్లి, సుల్తానాబాద్‌ మండలం కందునూరిపల్లి, మంథని మండలం గోపాల్‌పూర్, నాగెపల్లి, అక్కెపల్లి, కన్నాల, ముత్తారం మండలం దర్యాపూర్, కమ్మంపల్లి, ఓదెల మండలం గుంపుల, గుండ్లపల్లి, కొలనూర్, పాలకుర్తి మండలం జయ్యారం, రామగిరి మండలం సుందిళ్ల, చందనాపూర్, ఆదివరంపేటకు చెందిన కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు.


శిక్షణ ఇవ్వకుండానే విధులా.. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలులోకి తెచ్చి వాటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ సర్పంచ్, కార్యదర్శులకే కట్టబెట్టడం సమంజసం కాదని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కొత్తగా విధుల్లో చేరిన తమకు తమ విధులు, బాధ్యతల గురించి ఏమాత్రం అవగాహన లేదని, తమకు వృత్యంతర శిక్షణను ఇప్పించి నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసం ధాన కర్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల ఒత్తిడిలతోపాటు ఉన్నతాధికారులు కూడా తమనే బాధ్యులుగా చేస్తుండడంతో విధి నిర్వహణలో తాము ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుందని పలువురు పంచాయతీ  కార్యదర్శులు వాపోతున్నారు.  

>
మరిన్ని వార్తలు