తొలివేతనం అందేదెన్నడో..!

5 Jul, 2019 11:14 IST|Sakshi

పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరి మూడు నెలలు

ఇప్పటికీ అందని మొదటి నెల జీతం

జిల్లాలో 353 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు

సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని సంబురపడుతున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులకు విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఇంత వరకు మొదటి నెల జీతం రాలేదు. మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారికి వేతనాలు విడుదల చేయడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో పాత గ్రామ పంచాయతీ కార్యదర్శులు 84 మంది విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో 436 గ్రామ పంచాయతీ కార్యదర్శులకు గాను 396 మంది ఎంపిక కాగా, వీరిలో 353 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధులలో చేరారు. వీరికి గత ఏప్రిల్‌ నెల 11న నియామకపు ఉత్తర్వులు ఇవ్వడంతో వారు ఏప్రిల్‌ 12న విధులలో చేరారు. ఈనెల 12తో వీరు విధుల్లో చేరి మూడు నెలలు పూర్తి కానుంది. మొదటి నెల వేతనం ఎప్పుడు వస్తుందో అది తీసుకుని తల్లితండ్రులకు మంచి బహుమతిని ఇవ్వాలనుకుంటున్న వారికి నిరాశ ఎదురవుతోందని నూతనంగా విధుల్లో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.

వేతనాలు రాక అవస్థలు
విధుల్లో చేరి మూడు నెలలు కావస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు అందని కారణంగా అప్పులు చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల వద్ద అప్పులు తీసుకుని గడపాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నారు. ప్రతి రోజు విధులకు 10 నుంచి 20 కిలో మీటర్ల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వెళ్లాలంటే పెట్రోల్‌తో పాటు ఇతర ఖర్చులకు డబ్బులు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.

వారం రోజుల్లో అందిస్తాం
నూతనంగా విధులలో చేరిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల వేతనాలను వారం రోజుల్లో అందిస్తాం. వీరికి సంబంధించిన అకౌంట్ల వివరాలను ట్రెజరీ కార్యాలయానికి పంపుతున్నాం. వేతనాలు త్వరగా అందేలా చూస్తాం.
– చిన్నారెడ్డి, ఎంపీడీవో, ఎల్లారెడ్డి

స్నేహితుల దగ్గర అప్పులు చేస్తున్నా..
విధుల్లో చేరి మరో వారం రోజులు గడిస్తే మూడు నెలలు కావస్తుంది. కానీ ఇంత వరకు మొదటి నెల జీతం రాలేదు. దీంతో డబ్బుల కోసం స్నేహితుల వద్ద అప్పులు చేయాల్సి వస్తుంది.
– చరణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి

వేతనాలు వెంటనే ఇవ్వాలి
ప్రభుత్వం తమకు సంబంధించిన వేతనాలను వెంటనే అందించాలి. డబ్బులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం. రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేక తిప్పలు పడాల్సి వస్తోంది. 
– సిద్ధు, గ్రామ పంచాయతీ కార్యదర్శి

మరిన్ని వార్తలు