పంచాయతీ కార్మికులకు పది వేల జీతం ఇస్తాం

11 Aug, 2018 11:57 IST|Sakshi
కార్మికులకు సంఘీభావం తెలుపుతున్న జీవన్‌రెడ్డి 

 జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌(జగిత్యాల): కాంగ్రెస్‌ పార్టీ 2019లో అధికారంలోకి వస్తే పంచాయతీ కార్మికుల వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచుతామని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హామీ ఇచ్చారు. సారంగాపూర్‌ మండల కేంద్రంలో సారంగాపూర్, బీర్‌పూర్‌ మండలాల పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నారని అన్నారు.

పంచాయతీ కార్మికుల సమ్మెపై  ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని తెలిపారు. ప్రస్తుతం సర్పంచుల పదవీకాలం ముగియడంతో, ప్రత్యేకాధికారులు భాధ్యతలు చేపట్టి, పారిశుధ్యం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెను తక్షణమే విరమింపజేయడానికి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు.

ప్రస్తుత ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమ్మెపై అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ పంచాయతీ కార్మికులు హైదరాబాద్‌లో శనివారం నిర్వహించే ఆత్మగౌరవ సభలో వేతనం పెంపు హామీని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా ప్రకటింపజేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్య సరళ, వైస్‌ ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, మండల కోఅప్షన్‌ సభ్యుడు ఎండీ.ఇబ్రహీం, పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్, మాజీ సర్పంచ్‌ న్యారబోయిన గంగాధర్, పార్టీ సీనియర్‌ నాయకులు వురుమల్ల లక్ష్మారెడ్డి, కొక్కు గంగారాం, కాలగిరి సత్యనారాయణరెడ్డి, ఎదులాపురం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు