కరోనా పనులకు 14వ ఆర్థిక సంఘం నిధులు 

17 May, 2020 03:51 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి చర్యలకు 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలు వినియోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటివరకు పారిశుద్ధ్యం, తాగునీరు, మూలపనులకు మాత్రమే ఈ నిధులను ఉపయోగించే అవకాశముండేది. తాజాగా కరోనా నియంత్రణ పనులకు కూడా ఈ నిధులను వాడుకునే వెసులుబాటును కేంద్ర çపంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ కల్పించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున.. పంచాయతీలకు నిధుల కటకట ఏర్పడింది. 

తాజాగా గ్రామాల్లోని స్కూళ్లు, రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు, పశుసంవర్థక శాఖ కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని సూచించింది. అలాగే శానిటేషన్‌ పనులు నిర్వహించే సిబ్బందికి హ్యాండ్‌వాష్, మాస్క్‌లను కూడా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలావుండగా, 2019–20 వార్షిక సంవత్సరంతో 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసింది. అయితే, దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పద్దుకింద మిగిలిపోయిన నిధులను వాడుకునేందుకు ఏడాదికాలం కలిసిరానుంది.

మరిన్ని వార్తలు