పంచాయితీలు కార్పోరేషన్‌లో విలీనం

16 Mar, 2019 12:22 IST|Sakshi
అల్గునూర్‌ పంచాయతీ భవనానికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ బోర్డు

సాక్షి, అల్గునూర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్‌ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్‌ కార్పొరేషన్‌ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్‌ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్‌ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్‌ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్‌ బోర్డులు ఏర్పాటుచేశారు.  


హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. 
తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది.  దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయడాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్‌ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. 


రికార్డులు స్వాధీనం.. 
ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.  పంచాయతీ భవనాలకు కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.  


కార్పొరేషన్‌ పాలన ప్రారంభం.. 
తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్, మానకొండూర్‌ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్‌ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్‌ పాలన మొదలైంది. 


పన్నులు పెరగవు.. 
గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్‌ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్‌ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్‌కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను డీసీఎంఏకు రాసి ఆన్‌లైన్‌ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్‌ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్‌లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు