ఉద్యోగం ఇప్పించండి..

4 Jul, 2019 10:08 IST|Sakshi
ఉద్యోగం కల్పించాలని కోరుతున్న హోంగార్డు ఖాసీం, అతని కుటుంబం

తండ్రి జాబ్‌ కోసం ఓ కూతురు పోరాటం  

పక్షవాతంతో మంచాన పడిన తండ్రి 

సాక్షి, పాల్వంచ: పోలీస్‌ శాఖలో హోంగార్డుగా పనిచేసి ఓ వ్యక్తి పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. ఓ రోడ్డు ప్రమాదంలో అతడి భార్య కదల్లేని స్థితిలో ఉంది. అదే రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక మిగిలింది ఆ ఇంట్లో వారి కూతురు. ఆమెకు తన తండ్రి ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంటోంది. తద్వారా తన తల్లిదండ్రులకు మంచి వైద్యం చేయించుకుంటానని, చివరి అంకంలో వారికి చేదోడువాదోడుగా ఉంటానని చెబుతోంది. ఆ కుటుంబ దీన గాథ పలువురిని కలచివేస్తోంది.పాల్వంచ పట్టణంలోని బాపూజీ నగర్‌కు చెందిన షేక్‌ ఖాసీం పోలీస్‌ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించాడు.

1999లో పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో మంచానికే పరిమితమయ్యాడు. అతడి ఉద్యోగం భార్య మొగలాబీ చేయాలంటే ఖాసీంకు సపర్యలు చేసే దిక్కులేదు. దీంతో ఉద్యోగం కుమారుడు యాకూబ్‌పాషాకు ఇవ్వాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఐదేళ్లుగా ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఇంతలో గత జనవరి 4వ తేదీన కొత్తగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు యాకూబ్‌పాషాతో పాటు మనవడు మృతి చెందారు.

ఈ ప్రమాదంలో మొగలాబీ నడుము విరిగింది. ఏ పని చేయలేని పరిస్థితికి చేరింది. దీంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయి ఉంది. ఇక కుటుంబ భారం మొత్తం ఎకైక కూతురు షేక్‌ మీరాబిపై పడింది. తల్లిదండ్రులు ఇద్దరు మంచానికి పరిమితం అవడంతో తండ్రి ఉద్యోగం తనకు కల్పించాలని కూతురు మీరాబీ వేడుకుంటోంది. తన భర్త ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, ఒక్కడు పనిచేస్తేనే మందులకు, ఇళ్లు గడవడానికి ఇబ్బందికరంగా మారిందని వాపోతోంది. పోలీస్‌ శాఖలో ఉద్యోగం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీలతో పాటు, ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందించినా సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తోంది తప్ప ఉద్యోగం ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమవుతోంది. ఇప్పటికైనా తన కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని ఆదుకోవాలని వేడుకుంటోంది. 
   

మరిన్ని వార్తలు