పరమపద.. గిదేం వ్యథ

25 Jun, 2019 09:27 IST|Sakshi
‘గాంధీ’లో నిరుపయోగంగా ఉన్న వాహనాలు

షెడ్డుకు చేరిన వాహనాలు  

సగానికి పైగా పనిచేయని వైనం  

మృతదేహాల తరలింపునకు పేదల ఇబ్బందులు  

ప్రైవేట్‌ అంబులెన్స్‌లే దిక్కు.. భారీగా చార్జీలు   

మొత్తం 26 వాహనాలు.. పనిచేస్తున్నవి 8  

సాక్షి, సిటీబ్యూరో: భువనగిరికి చెందిన శివప్రసాద్‌(39) కేబుల్‌ టీవీ ఆపరేటర్‌ వద్ద పని చేసేవాడు. ఈ నెల 18న కనెక్షన్‌ ఇచ్చేందుకు ఓ ఇంటిపైకి వెళ్లగా ప్రమాదవశాత్తు పైనున్న 33కేవీ విద్యుత్‌ లైన్‌ వైర్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 22న మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరుకు తీసుకెళ్లేందుకు బంధువులు ఆస్పత్రిలోని అధికారులను కలిశారు. ‘హెర్సే’ పరమపద పార్థివదేహాల తరలింపు వాహనాన్ని సమకూర్చాలని కోరారు. ఆస్పత్రిలో వాహనాలు లేకపోవడంతో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. గత్యంతరం లేకపోవడంతో ప్రైవేట్‌ అంబులెన్స్‌కు రూ.2,600 చెల్లించిమృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇది ఒక్క శివప్రసాద్‌ బంధువులకు ఎదురైన అనుభవమే కాదు... నగర ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న అనేక మంది బాధితుల బంధువుల వ్యథ. 

2016లో ప్రారంభం..  
ప్రస్తుతం నగరంలో సుమారు కోటి మందికి పైగా ఉంటారు. జిల్లాల నుంచి వివిధ పనులపై రోజుకు సగటున లక్ష మందికి పైగా వచ్చిపోతుంటారు. వీరిలో అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారు. ఇక హత్యలు, ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాల్లో చనిపోయిన వారితో పాటు వివిధ రుగ్మతలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారు ఉంటారు. ఇలా చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా, గాంధీ మార్చురీలకు తరలిస్తుంటారు. ఉస్మానియా మార్చురీకి రోజుకు సగటున 10–15 శవాలు వస్తుండగా, గాంధీ మార్చురీకి 15 వరకు వస్తుంటాయి. ఇక నీలోఫర్‌లో రోజుకు 12 మంది శిశువులు చనిపోతుండగా... నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో వారానికి ఒకరిద్దరు మృత్యువాతపడుతుంటారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తుంటారు. పేదరికానికి తోడు అప్పటికే వైద్య ఖర్చుల పేరుతో భారీగా నష్టపోవడం, ప్రైవేటు అంబులెన్సులు ఇందుకు భారీగా ఛార్జీ చేస్తుండటంతో ఆయా మృతదేహాల తరలింపు వారి బంధువులకు భారంగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం 2016 నవంబర్‌ 18న 50 ఉచిత హెర్సే పరమపద వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు 10 చొప్పున... నిమ్స్‌కు 2, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రికి 2, నిలోఫర్‌ ఆస్పత్రికి 2, ఇతర ఆస్పత్రులకు ఒక్కో వాహనాన్ని సమకూర్చింది. ఏడాది క్రితం వరకు ఇవి బాగానే పని చేశాయి. రోజుకు సగటున 25 మృతదేహాల చొప్పున సొంతూళ్లకు చేర్చేవి. ఈ ఉచిత సర్వీసులకు మంచి ఆదరణ లభించింది. నిర్వహణ లోపం వల్ల ఒక్కో వాహనం షెడ్డుకు చేరడంతో సమస్య మొదటికి వచ్చింది. 

పాతవాటికే రంగులు..  
నిజానికి ఏదైనా సర్వీసులు ప్రారంభించే ముందు కొత్తవాహనాలు కొనుగోలు చేయాలి. మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. నిర్వహణ కోసం అవసరమైన బడ్జెట్‌ను కేటాయించాలి. కానీ ఇందుకు భిన్నంగా కొత్త వాహనాలకు బదులుగా అప్పటికే నిర్వహణ లోపంతో షెడ్డుకు చేరిన 108 అంబులెన్స్‌లకు కొత్తగా రంగులు వేసి.. హడావుడీగా ప్రారంభోత్సవాలు చేశారు. అప్పటికే వాటి సర్వీసు ముగియడం, నిర్వహణ లోపం వల్ల ప్రారంభించిన కొద్ది కాలానికే మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా సగానికిపైగా వాహనాలు షెడ్డుకు చేరాయి. ఎలాగైనా వీటిని వదిలించుకోవాలని భావించిన అధికారులు వాటిలో ఇప్పటికే చాలా సర్వీసులను స్క్రాబ్‌కు తరలించారు. వాటి స్థానంలో కొత్త వాహనాలు ఏర్పాటు చేయకపోవడం, ఉన్నవి కూడా తరచూ మొరాయిస్తుండటం వల్ల మృతదేహాలను తరలించలేని దుస్థితి నెలకొంది. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో రెండు మూడు వాహనాలు పని చేస్తున్నా.. అవి కూడా తరచూ మొరాయిస్తున్నాయి. మృతుల నిష్పత్తికి తగినన్ని వాహనాలు లేకపోవడంతో ఒకే వాహనంలో ఒకే రూట్‌కు సంబంధించిన శవాలను ఒకేసారి తరలించాల్సి వస్తోంది. దీంతో శవాల తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. చనిపోయిన తర్వాత శవం కుళ్లిపోయి దుర్వాసన వెద జల్లే ప్రమాదం ఉండడంతో ఆర్థికంగా భారమైనప్పటికీ... బంధువులు వాటిని ప్రైవేట్‌ అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. మృతుల బంధువుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది ప్రైవేటు అంబులెన్స్‌ల యజమానులు దూరాన్ని, తరలింపు సమయాన్ని బట్టి చార్జీలు నిర్ణయిస్తున్నారు. చేసేదేమీ లేక బాధితులు వారు అడిగినంత చెల్లించి మృతదేహాలను తీసుకెళ్తున్నారు. ఆ స్తోమత లేనివారు అనాథ శవాల జాబితాలో చేర్చి.. దహన సంస్కారాల కోసం జీహెచ్‌ఎంసీకి అప్పగిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉంటే స్క్రాబ్‌కు చేరిన వాహనాల స్థానంలో ఇప్పటికే పలు కొత్త వాహనాలు సమకూర్చామని, మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో సమకూర్చుతామని హెర్సే పరమపద వాహనాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు