ఇక ఆర్టీసీ పార్శిల్‌ సర్వీస్‌!

20 Jun, 2020 04:58 IST|Sakshi

రోడ్డు రవాణా సంస్థలో పార్శిల్, కొరియర్‌ సేవలు ప్రారంభం

కార్గోకు అనుబంధంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సొంతంగా పార్శిల్, కొరియర్‌ సేవలు ప్రారంభించింది. ఇప్పటికే సరుకు రవాణాకు కార్గో బస్సులను రంగంలోకి దింపిన ఆర్టీసీ.. దానికి అనుబంధంగా పార్శిల్, కొరియర్‌ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌ ప్రాంగణంలో వీటిని ప్రారంభించారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో పార్శిళ్ల తరలింపు ఉండేది. ఓ ప్రైవేటు సంస్థ ఆ వ్యవహారాన్ని చూసుకునేది. ఆ సంస్థ ఆర్టీసీకి నామమాత్రంగా రుసుము చెల్లించి రూ.కోట్లలో ఆదాయాన్ని పొందుతూ వచ్చింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో పార్శిళ్ల తరలింపును సొంతంగా నిర్వహించి ఆదాయాన్ని పెంచుకోవాలని సీఎం కేసీఆర్‌ గతం లో ఆదేశించారు. దీంతో మంత్రి అజయ్‌కుమార్‌ పాత ఒప్పందాలు రద్దు చేయించి పార్శిళ్లు, కొరియర్‌ సేవలను ఆర్టీసీ సొంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

అన్ని బస్సుల్లోనూ సరుకుల తరలింపు...
పల్లెవెలుగు మొదలు అన్ని కేటగిరీ ఆర్టీసీ బస్సుల్లో సరుకులు తరలించనున్నారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో దిగువ భాగాన డిక్కీలుండగా, పల్లెవెలుగు బస్సుల్లో కొత్తగా డ్రైవర్‌ సీటు పక్క ఉండే సింగిల్‌ సీటు తొలగించి బాక్సు ఏర్పాటు చేశారు. అందు లో సరుకులు తరలిస్తారు. గరిష్టంగా ఓ వ్యక్తి 50 కిలోల వరకు పంపించొచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే 50 కిలోల చొప్పున విభజించి పంపించాల్సి ఉంటుంది. 180 కిలోమీటర్లకు 50 కిలోల పార్శిల్‌ తరలింపునకు క్లరికల్, హమాలీ, ఇన్సూరెన్స్‌ తదితర ఖర్చులన్నీ కలిపి రూ.165 వరకు చార్జీ చేస్తారు. కిలోమీటర్లు, బరువు పెరిగే కొద్దీ చార్జీ కూడా పెరుగుతుంది. ప్రస్తుతానికి బస్టాండుకు సరుకులు తీసుకెళ్లి అందిస్తే, గమ్యస్థానంలోని బస్టాండు వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సంబంధిత వ్యక్తులు వచ్చి తమ సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరో 15 రోజు ల్లో ఆథరైజ్ట్‌ బుకింగ్‌ డీలర్లు, ఉత్సాహం ఉన్న ఆర్టీసీ సిబ్బంది ద్వారా ఇళ్లకే వచ్చి సరుకులు తీసుకెళ్లి, గమ్యస్థానంలోని ఇళ్లకు చేర్చే ప్రక్రియ మొదలుపెడతారు. ఈ–కామర్స్‌ సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని ఆర్టీసీ యోచిస్తోం ది. ప్రస్తుతం 140 బస్టాండ్లలో ఈ సేవలు ప్రారంభించారు. చార్జీల వివరాలను ఆర్టీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పార్శిల్, కొరి యర్‌ విభాగం బాధ్యతలను మంత్రి ఓఎస్డీ కృష్ణకాంత్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమం లో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు వినోద్, వెంకటేశ్వర్లు, టీవీరావు, పురుషోత్తం, యాదగిరి, ప్రత్యేకాధికారి కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.

మెరుగ్గా నిర్వహిస్తే మంచి ఆదాయం
‘ప్రభుత్వ కార్పొరేషన్లకు సంబం ధించి సరుకులు తరలించేందుకు ఇటీవలే కార్గో సేవలను ప్రారంభించిన ఆర్టీసీ.. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు పార్శిల్‌ సేవలను కూడా మొదలుపెట్టింది. దీన్ని మెరుగ్గా నిర్వహించటం ద్వారా సాలీనా రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఆదాయాన్ని పొందే వీలుంటుంది. కొద్ది రోజుల్లోనే సిబ్బంది ఇళ్లకే వచ్చి సరుకులు తీసుకెళ్లి గమ్యం చేర్చేలా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను సిద్దం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ–కామర్స్‌ విధానం ద్వారా సరుకుల తరలింపు ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో అన్ని ఊళ్లకు అనుసంధానమై ఉన్న ఆర్టీసీ బస్సులను ఆయా సంస్థలు సరుకుల తరలింపునకు వాడుకోవాలి’ – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణాశాఖ మంత్రి 

 ఖైరతాబాద్‌లో ట్రాన్స్‌పోర్టు భవన్‌ ప్రాంగణంలో ఆర్టీసీ పార్శిల్‌ కొరియర్‌ సేవల్ని ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ 

మరిన్ని వార్తలు