ఆర్టీసీ.. పార్సిల్ సర్వీస్

4 Dec, 2016 03:10 IST|Sakshi
ఆర్టీసీ.. పార్సిల్ సర్వీస్
  •  కొత్తగా కొనే బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు
  •  తొలుత తేలికపాటి వస్తువులతో ప్రారంభం
  •  సత్ఫలితాలిస్తే తదుపరి కార్గో విభాగం ఏర్పాటు
  • సాక్షి, హైదరాబాద్: అప్పులు, నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీ ఆదాయం కోసం కొత్త దారులు వెతుకుతోంది. ఇందులో భాగంగా పార్సిల్ సర్వీసు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రైవేటు కొరియర్ సంస్థల తరహాలో బస్సుల్లో పార్సిల్ కవర్లు, తేలికపాటి వస్తువులను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత జూన్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆర్టీసీ సమీక్ష సందర్భంలో సరుకు రవాణాపై దృష్టి సారించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో చాలాకాలంగా అక్రమంగా సరుకు రవాణా సాగుతోంది. కమీషన్ల మత్తులో ఉన్న రవాణాశాఖ అధికారులు చూసీ చూడనట్టు పోతుండటంతో వాటిల్లో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు యథేచ్ఛగా కార్గో వ్యాపారం సాగిస్తున్నారు.

    ఆర్టీసీ బస్సుల్లో తేలికపాటు సరుకుల రవాణా ప్రస్తుతం సాగుతోంది. బస్సు టాప్‌పై వాటిని సరఫరా చేస్తున్నా, ఆ బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఇందులో ఆర్టీసీకి వచ్చే ఆదాయం నామమాత్రంగానే ఉంటోంది. ఈ విషయంలో కూడా కమీషన్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ప్రయోగాత్మకంగా పార్సిల్ సర్వీసుకు శ్రీకారం చుట్టబోతున్నారు.
     
    కొత్త బస్సులతో ప్రారంభం...
    త్వరలో ఆర్టీసీ దాదాపు వేయి కొత్త బస్సులు సమకూర్చుకుంటోంది. వీటిని తయారు చేసేప్పుడే బస్సులోపల పార్సిళ్లు పెట్టేందుకు వీలుగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రైవేటు సంస్థతో ఉన్న ఒప్పందం ఇంకా పూర్తి కానుందున, తొలుత కొత్త బస్సుల్లోనే ఆర్టీసీ పార్సిల్ సర్వీసు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత పాత బస్సులకూ వర్తింప చేయనుంది.

    ఏపీ ప్రయోగంతో....
    ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పార్సిల్ సర్వీసును ప్రారంభించింది. మూడు నెలల్లో దాదాపు రూ.19 కోట్ల మేర ఆదాయం సమకూరింది. దీంతో ఈ ప్రయోగం లాభదాయకమేనని టీఎస్ ఆర్టీసీ కూడా నిర్ణయించుకుంది. సరుకులను బస్సుల్లో చేర్చిన తర్వాత వాటి వివరాలను డ్రైవర్‌కు అందజేస్తారు. బస్సు ఆయా బస్టాండ్లకు చేరగానే అక్కడ ప్రత్యేకంగా ఉండే సిబ్బంది వచ్చి ఆ సరుకులను దించి బస్టాండ్‌లోని పార్సిల్ కౌంటర్‌లోకి చేరుస్తారు. అక్కడ సరిచూసిన తర్వాత సిబ్బంది వాటిని సంబంధిత చిరునామాకు చేరవేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిపై నియమించుకోనున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే భవిష్యత్తులో కార్గో వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు