గురుకుల విద్యార్థి అదృశ్యంపై ఆందోళన

15 Mar, 2017 18:49 IST|Sakshi

► ఏన్కూర్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో
► పోలీసుల హామీతో విరమణ

ఏన్కూర్‌: కనిపించకుండా పోయిన స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థి అచూకీ తెలపాలంటూ తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఏన్కూర్‌ ప్రధాన సెంటర్‌లో ఆందోళన చేశారు. గత నెల 27న  8 వతరగతి చదువుతున్న గార్లపాటి ఉదయ్‌కిరణ్‌  అనుమతి లేకుండా గురకులం నుంచి బయటకు వెళ్లి పోయాడు. ఈ క్రమంలో బాలుడి సమాచారం లేదని తండ్రి రామకృష్ణ, పాఠశాల యాజమాన్యం ఏన్కూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. అప్పటి నుంచి పోలీసులు, విద్యార్థి బంధువులు విద్యార్థి కోసం వెతుకులాట ప్రారంభించారు.

దాదాపు 20 రోజులు కావస్తున్నా తమ పిల్లాడి ఆచూకీ తెలియలేదని, గురుకులంలో అడిగితే ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆగ్రహించిన విద్యార్ధి బంధువులు ఏన్కూర్‌ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన లేక పోవడంతో ఏన్కూర్‌ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు గంటన్నర సేపు రోడ్డు పై బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులతో మాట్లాడారు. విద్యార్థి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

మరిన్ని వార్తలు