మమ అనిపించారు

3 Aug, 2014 01:45 IST|Sakshi
మమ అనిపించారు

- కాకతీయ హైస్కూల్‌పై విచారణ
- ఇలా వచ్చి అలా వెళ్లిన డీఈఓ, ఏజేసీ
- నోటీసు గడువు ముగిసినా  చర్యలకు వెనుకంజ

తూప్రాన్: మాసాయిపేట దుర్ఘటనలో 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, యావత్ దేశం అయ్యోపాపమంటూ కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనలో కాకతీయ హైస్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తినా, అధికారులు మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైలు ప్రమాద పూర్వాపరాలు, పాఠశాల యాజమాన్యం పాత్ర తదితర అంశాలపై విచారణ చేపట్టేందుకు శనివారం కాకతీయ హైస్కూల్‌లుకు వచ్చిన ఏజేసీ మూర్తి, డీఈఓ రాజేశ్వర్‌రావు, ఆర్‌వీఎం అధికారిని యాసీన్‌బాషాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

ప్రమాద ఘటనపై పాఠశాల పాత్ర ఏమిటన్నదానిపై మూడు రోజుల కిందటే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామని, శనివారంతో ఆ గడువు కూడా ముగిసిందన్న డీఈఓ..స్కూల్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటామన్న దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి వారిచ్చే సూచన మేరకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. మరోవైపు ఏజేసీ మూర్తి కూడా కేవలం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడటంతోనే సరిపెట్టారు. ఇక ఆర్వీఎం అధికారిని యాసీన్‌బాషా మాత్రం ప్రేక్షకపాత్ర పోషించారు.
 
పాఠశాల తెరవాలంటూ తల్లిదండ్రుల పట్టు!

విచారణ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న సుమారు 600 పైగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాఠశాలను వెంటనే తెరువాలని పట్టుబట్టారు. ఇప్పటికే యూనిఫాం, పుస్తకాలు తీసుకోవడంతో పాటు మొదటి విడత ఫీజులు చెల్లించామని ఏజేసీ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అనుమతులు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  రైలు ప్రమాదంలో పాఠశాలకు చెందిన 18 మంది చిన్నారులు దుర్మరణం చెందడం, మరో 18 మంది ఆస్పత్రిలో చికిత్సలు పొందడం చాలా బాధకరమని, ఇందుకు తాము సైతం చింతిస్తున్నట్లు అదనపు జేసీ ముందు వాపోయారు.

ఈ సందర్భంగా అదనపు జేసీ స్పందిస్తూ ఈ పాఠశాలకు చెందిన చిన్నారులను స్థానిక ప్రభుత్వ పాఠశాల, ఇతర ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తామన్నారు. ఇందుకు ఒప్పుకోని తల్లిదండ్రులు కాకతీయ పాఠశాలను తెరిపించాలని పట్టుబట్టారు. దీంతో తమ అభిప్రాయాలను రాసి డీఈఓ రాజేశ్వర్‌రావుకు అందిస్తే ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఏజేసీ మూర్తి వారితో తెలిపారు.  
 
విద్యార్థుల సంఖ్య కూడా తప్పే

కాకతీయ హైస్కూల్లో సుమారు 600 మంది విద్యార్థులు చదువుతుండగా, కేవలం 378 మంది విద్యార్థులే ఉన్నట్లు  కాకతీయ హైస్కూల్ యాజమాన్యం వెల్లడించిందని డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. అందువల్లే జిల్లాలోని అన్ని పాఠశాలకు చెందిన విద్యార్థుల సంఖ్యను తరగతుల వారీగా సమాచారం అందించాలని అన్ని మండలాలకు చెందిన ఎంఈఓలను ఆదేశించినట్లు డీఈఓ తెలిపారు. ఇందుకోసం ఈ నెల 5న సంగారెడ్డిలో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 స్కూల్ బస్సులు సీజ్ చేయగా,  నిబంధనలకు విరుద్ధంగా 19 ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నట్లు గుర్తించి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు.

మరిన్ని వార్తలు