ప్రాణం పోసిన ‘సోషల్‌ మీడియా’

22 May, 2019 09:01 IST|Sakshi
చిన్నారితో మధు యాదవ్, సునీతారాణి దంపతులు

కుమారుడి ఆపరేషన్‌కు ఆర్థిక సహాయం అందజేయాలని తల్లిదండ్రుల విజ్ఞప్తి  

స్పందించిన దాతలు  

భాగ్యనగర్‌కాలనీ: సోషల్‌ మీడియా ఓ చిన్నారికి ప్రాణం పోసింది. తన కుమారుడి ఆపరేషన్‌ కోసం ఆర్థిక సహాయం అందజేయాలని తల్లిదండ్రులు సోషల్‌ మీడియాలో కోరగా పలువురు స్పందించారు. నేతల సహాయంతో మొత్తం ఆపరేషన్‌ ఖర్చులు అందజేసేలా కృషి చేశారు. నిజామాబాద్‌ జిల్లా కామరపల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మధుయాదవ్, సునీతారాణి దంపతులకు మే 8న మగబిడ్డ జన్మించాడు. అయితే శిశువు పెద్ద పేగు మూసుకుపోయిందని, ఆపరేషన్‌ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు పేర్కొన్నారు. దీంతో వెంటనే శిశువుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్‌కు రూ.5లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు సోషల్‌ మీడియా ద్వారా దాతలను వేడుకొన్నారు. హైదర్‌నగర్‌ డివిజన్‌లో నివాసముంటున్న నెస్ట్‌ ప్రణీత్‌ హ్యాపీ హోమ్స్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేశ్‌బాబు, డాక్టర్‌ రెడ్డి లేబోరేటరీ ఉద్యోగులు, సురేందర్‌ ఫౌండేషన్‌ మెట్‌పల్లి, ఆర్ట్‌ ఆఫ్‌ సర్వీంగ్‌ హ్యుమానిటీ ట్రస్టు సభ్యులు స్పందించి విరాళాల ద్వారా రూ.లక్షన్నర సేకరించారు. ఈ విషయాన్ని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్‌ సీఎం సహాయ నిధి నుంచి ఆపరేషన్‌ ఖర్చులకు రూ.2.50 లక్షల మంజూరు చేయించారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఆపరేషన్‌కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు