నాన్‌ టీచింగ్‌ డిప్యుటేషన్లు రద్దయ్యేనా? 

26 Dec, 2018 04:47 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసి వదిలేస్తున్న విద్యాశాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల డిప్యుటేషన్లపై విద్యాశాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో బోధనేతర పనుల్లో కొనసాగుతున్న టీచర్లు ఈసా రైనా తమ డిప్యుటేషన్లు రద్దవుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నం కావడంతో డిప్యుటేషన్ల రద్దుపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ఆశలపై విద్యాశాఖ అధికారులే నీళ్లు చల్లుతూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలకు చెందిన వందల మంది టీచర్లు ఇంకా డిçప్యుటేషన్లపై కొనసాగుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడిగితే ఉన్నతాధికారులు ఓ మెమో జారీ చేయడం, తర్వాత మిన్న కుండిపోవడం పరిపాటిగా మారిపోయింది. దీంతో ఆయా టీచర్లు పనిచేస్తున్న వందల పాఠశాలల్లో విద్యాబోధన లేకుండాపోతోంది.

మండలాల్లోని రిసోర్సు సెంటర్లు, జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల విద్యా డైరెక్టరేట్‌(డీఎస్‌ఈ)లోనూ టీచర్లు డిప్యుటేషన్లపై కొనసాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న టీచర్లపైనే డీఈవో ఆధారపడి పనిచేస్తుండటంతో ఆయా టీచర్ల ఇష్టారాజ్యం సాగుతుంది.  
టీచర్ల కొరత ఉన్నప్పటికీ..: రాష్ట్రంలో 25 వేల వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో ఇప్పటికే టీచర్ల కొరత తీవ్రంగా ఉంది.

2,000 పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నాయి. 5,000 వరకు ఉన్న ఉన్నత పాఠశాలల్లోనూ సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. పాఠశాల విద్యా డైరెక్టర్‌గానీ, ప్రభుత్వంగానీ ఈ విషయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో పాఠశాలల్లో విద్యా బోధన కుంటుపడుతోంది. అయినా పాఠశాలల్లో పని చేయాల్సిన టీచర్లను విద్యాశాఖ ఉన్నతాధికారులే జిల్లా, రాష్ట్ర, మండల కార్యాలయాల్లో కొన్నింటిలో అధికారికంగా, మరికొన్నిం టిలో అనధికారికంగా కొనసాగిస్తుండటం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనేతర పనుల్లో టీచర్లకు ఇచ్చిన డిప్యుటేషన్లపై విద్యాశాఖ పదుల సంఖ్యలో ఉత్తర్వులు జారీ చేసినా.. అవేవీ అమలుకు నోచుకోలేదు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
టీచర్లు సిలబస్‌ పూర్తి చేసి, విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన సమయం వచ్చేయడంతో ఇప్పుడైనా అక్రమ, అనధికార, అధికారిక డిప్యుటేషన్లను రద్దు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నత తరగతులకు బోధించే స్కూల్‌ అసిస్టెంట్లే 90% మంది డిప్యుటేషన్లలో కొనసాగుతుండటంతో ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటున్నాయని, బోధించేవారు లేకుండాపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు