కదిలిస్తే కన్నీళ్లే...

23 Apr, 2020 11:44 IST|Sakshi

‘బిడ్డా! మీరు పైలంగ ఉండుండ్రి. ఈడ అందరం ఇంటి పట్టునే ఉన్నం. మీరేమో దూరంల ఉంటిరి. ఆడగూడ ఈ రోగం అంటుకుంటున్నదని టీవీలల్ల జెప్తుర్రు.. నాకైతే నిద్ర పడుతలేదు. నాయిన మీ గురించే ఆలోచన జేసుకుంట నిద్రల కలువరిల్లుతుండు. ఈ గత్తర పోవాలని, అందరు మంచిగ ఉండాలని తీరొక్క దేవుండ్లకు మొక్కుకుంటున్నం. మీరు పైలం బిడ్డ’’.

దోమకొండ మండలం అంబారీపేటకు చెందిన దాసరి మల్లవ్వ దోహఖత్తర్‌లో ఉన్న కుమారుడి తో ఫోన్‌లో చెప్పిన మాటలివి.. మల్లవ్వ, బాల్‌ రాజ్‌ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు సత్తయ్యతో పాటు మనవడు భరత్‌ దోహఖత్తర్‌లో, చిన్న కుమారుడు రాములు మ స్కట్‌లో ఉంటున్నారు. కరోనా నేపథ్యంలో మ ల్లవ్వ రోజూ తన కుమారులతో వీడియో కాల్‌ ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకుంటోంది. భయాన్ని, బాధను వెలిబుచ్చుతూనే కుమారులకు ధైర్యం చెబుతోంది. 

పైలం కొడుకా.. ‘‘కరోనా అచ్చినసంది మనసు మనసున ఉంటలేదు. మేమంతా ఇంటికాడ మంచిగనే ఉంటున్నం. నువ్వు ఎట్లున్నవోనని భయమైతుంది. నువ్వు పైలంగ ఉండు బిడ్డా. ఎటూ తిరుగకు. రూంలనే ఉండి ఉన్నది తినుకుంట ఉండు గని బయట తిరిగి పరేషాన్‌ గాకు’’

– సౌదీలో ఉన్న కుమారుడు జనపాల నారాయణతో మాచారెడ్డికి చెందిన తల్లి లక్ష్మి పేర్కొంది. ఆమె తన కుమారుడితో ఫోన్‌లో మాట్లాడుతూనే కన్నీరు పెట్టుకుంది. రోజూ కొడుకుతో ఫోన్‌లో మాట్లాడుతున్నానని, కరోనా రోగం గురించి తెలిసిన సంది మస్తు భయమవుతోందని ‘సాక్షి’తో పేర్కొంది.

సాక్షి, కామారెడ్డి: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి కుటుంబాలను కలవరపెడుతోంది. దేశంగాని దేశంలో ఉన్న తమ వారు ఎట్లున్నరోనని వాళ్ల తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులుగా గల్ఫ్‌ దేశాల్లోనూ కరోనా విస్తరిస్తుండడంతో అక్కడ పనులు నిలిచి పోయాయి. చాలా మంది గదులకే పరిమితమయ్యారు. కనీసం గడప దాటే పరిస్థితులు లేకుండా పోయాయి. అయితే, బతుకుదెరువు కోసం వలస వెళ్లిన తమ వారి యోగక్షేమాల కోసం వారి కుటుంబ సభ్యులు కలవరానికి గురవుతున్నారు. రోజూ వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు. నిత్యం మాట్లాడుతున్నా కనిపించని భయం వారిని వెన్నాడుతోంది. (లాక్‌డౌన్‌.. టిక్‌ టాక్‌ల జోరు)

ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎట్లున్నరోనని ఆందోళన చెందుతున్నారు. పొట్ట చేతపట్టుకుని ఎడారి దేశాలకు వెళ్లిన వారి కుటుంబాలు గతంలో ఎన్నడూ లేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కొడుకుల కోసం తల్లిదండ్రులు, భర్త కోసం భర్య, తండ్రి కోసం పిల్లలు తల్లడిల్లుతున్నారు. గల్ఫ్‌లోని ఫలానా దేశంలో కరోనా వ్యాధి బారిన పడ్డ వారిలో భారత్‌కు చెందిన కారి్మకులు ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే తమ వారికి ఫోన్‌ చేసి కనుక్కుంటున్నారు. ‘ఈ గత్తర పాడుగాను ఎప్పుడు పోతదో’ అనుకుంటూ ఆవేదన చెందుతున్నరు. ‘మా పిల్లలకు ఏ ఆపదా రావద్దు’ అంటూ దేవుడిని వేడుకుంటున్నరు. కరోనా నేపథ్యంలో గల్ఫ్‌ వలస కుటుంబాలను కదిలిస్తే చాలు.. కంటి వెంట నీరు ధారలా వచ్చేస్తోంది. (పూడ్చిన శవానికి పోస్టుమార్టం)

కరోనా నేపథ్యంలో నెల రోజులుగా ప్రపంచం మొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఎక్కడి పనులు అక్కడే నిలిచి పోయాయి. పని లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారంతా గదులకే పరిమితమయ్యారు. కొందరు చేతిలో డబ్బులు లేక స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని కాలం వెల్లదీస్తున్నారు. రోజుల తరబడి పని లేక ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లాలన్నా ఎక్కడ కరోనా అంటుకుంటుందోనన్న భయం వారిని వెన్నాడుతోంది. కొన్ని దేశాల్లో ఇరుకు గదుల్లో పది, పదిహేను మంది ఉంటున్నారు. వారంతా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోసం వలస వచ్చిన తాము ఉపాసం ఉండాల్సి వస్తోందని బహ్రెయిన్‌లో ఉంటున్న ఓ కారి్మకుడు ‘సాక్షి’తో ఫోన్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ రకంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని తెలిపాడు. జైల్లో ఉన్నట్టు ఉందని మరో వలస కారి్మకుడు పేర్కొన్నాడు. (ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడి తండ్రి మృతి )

మరిన్ని వార్తలు