బీజేపీ ఆందోళన ఉద్రిక్తం

12 Jul, 2018 11:57 IST|Sakshi
రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

కరీంనగర్‌సిటీ: ధర్మాగ్రహ యాత్ర పేరుతో హైద్రాబాద్‌ నుంచి యాదాద్రి వరకు నిర్వహించాలనుకున్న  పరిపూర్ణానంద స్వామిని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు గృహ నిర్భంధంతోపాటు నగర బహిష్కరణ విధించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. స్వామిపై రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట ప్రధాన రహదారిపై బుధవారం భారీ రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాటతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాదాపు గంటసేపు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

దీంతో పోలీసులు భారీగా మోహరించి బండి సంజయ్‌తో సహా కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ పరిపూర్ణనందను నగర బహిష్కరణతో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానం బహిర్గతమైందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందువుల ఆరాద్యదైవమైన శ్రీరాముని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేశ్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌ చేయకుండా కేవలం నగర బహిష్కరణ వేటుతో చేతులు దులుపుకుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతస్తుల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చట్టానికి లోబడి నిరసన వ్యక్తం చేస్తున్న పరిపూర్ణానందపై కూడా నగర బహిష్కరణ వేటు వేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, జోనల్‌ ఇన్‌చార్జి తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, కొత్తపెల్లి రతన్‌కుమార్, కరీంనగర్‌ రూరల్‌ మండల అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, బీజేపీ, బీజేవైఎం నాయకులు గాజె రమేశ్, ఎన్నం ప్రకాశ్, మామిడి రమేశ్, కందుకూరి ఆంజనేయులు, శశి, పొన్నం మొండయ్య, కాశెట్టి శేఖర్, బండ అనిత, జెల్లోజు చిట్టిబాబు, ఉప్పరపెల్లి శ్రీనివాస్, పర్వతం మల్లేశం, ముప్పిడి సునీల్, కందుకూరి వెంకట్, అక్షయ్, తిరుపతి, సాయి, మహేశ్, హరీశ్, ఓదెలు, రామురాయ్, అభిలాష్, ప్రణయ్, నిఖిల్, సుమన్, సుధాకర్, రంజిత్‌ తదితరు పాల్గొన్నారు.       

మరిన్ని వార్తలు