20 కల్లా పరిషత్‌ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

16 Apr, 2019 01:53 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న నాగిరెడ్డి. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎస్‌ ఎస్‌కే జోషి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి 

18 –20 తేదీల మధ్య నోటిఫికేషన్‌ 

ఎన్నికల సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష 

హాజరైన సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు  

18న కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 20 కల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 18–20 తేదీల్లోగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ఎక్కువ సంఖ్యలో జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలున్నచోట, శాంతిభద్రతల పరిస్థితిని బట్టి కొన్ని జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలుండొచ్చు. మిగతా జిల్లాల్లో ఒకటి లేదా రెండు విడతల్లోనే ఎన్నికలు ముగిస్తాం. 18న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైన అనంతరం ఏయే జిల్లాల్లో మూడు విడతలుంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ఈ నెల 20 కల్లా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో 18–20 తేదీల్లోగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. అందులో నామినేషన్ల దాఖలు మొదలు ఎన్నికల వరకు 3 విడతల్లో ఏయే జిల్లాల్లో, ఏయే మండలాల్లో ఎప్పుడప్పుడు ఎన్నికలుంటాయి, తదితరాలపై స్పష్టమైన వివరాలు, సమాచారం ఉంటుంది’అని చెప్పారు. 

వసతుల కల్పనపై చర్చ 
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రధానంగా చేయాల్సిన భద్రతా ఏర్పాట్లు, మండువేసవిలో వీటిని నిర్వహిస్తున్నందున పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్లకు ఎండదెబ్బ తగలకుండా తగిన నీడ, మంచినీటి వసతి కల్పించడం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులోకి తీసుకురావడం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యయ అంచనా, దాని కేటాయింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్‌ బాక్స్‌లు, బ్యాలెట్ల ముద్రణ తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల సీనియర్‌ అధికారులు రాజేశ్వర్‌ తివారీ, కె.రామకృష్ణారావు, నవీన్‌ మిట్టల్, అధర్‌సిన్హా, సునీల్‌శర్మ, బి.జనార్దనరెడ్డి, నీతూకుమారి ప్రసాద్, అశోక్, సీనియర్‌ ఐపీఎస్‌లు తేజ్‌దీప్‌కౌర్‌ మీనన్, జితేందర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్, జయసింహారెడ్డి పాల్గొన్నారు. నాగిరెడ్డి వెల్లడించిన సమీక్ష వివరాలివీ.. 

32,007 పోలింగ్‌ కేంద్రాలు 
మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని 535 మండల ప్రజా పరిషత్‌లలోని 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఇందుకోసం 32,007 పోలింగ్‌ స్టేషన్లను వినియోగిస్తాం. ఇటీవలి లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 1.57 కోట్ల గ్రామీణ ఓటర్లున్నారు. పరిషత్‌ నోటిఫికేషన్‌ వెలువడే వరకు జాబితాలో చేరేవారికి కూడా ఓటు హక్కు కల్పించనున్నందున వీరి సంఖ్య 1.60 కోట్లకు చేరవచ్చని అంచనా. 

అధికారులు తీసుకోవాల్సిన చర్యలు 
పరిషత్‌ ఎన్నికల సందర్భంగా కొత్త పథకాల ప్రకటనగాని, వాటిపై హామీలుగాని ఇవ్వకూడదు. కొత్తగా ఆర్థికపరమైన మంజూరు చేయొద్దు. కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు. ఎస్‌ఈసీ అనుమతి లేకుండా ఏ అధికారినీ బదిలీ చేయరాదు. ప్రజాధనంతో ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదు.  

భద్రతాపరంగా... 
ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు ఎంతమంది భద్రతా సిబ్బంది అవసరమన్న దాని ప్రాతిపదికన భద్రతా దళాలపై అంచనా వేయాలి. వివిధ జిల్లాలు, మండలాల్లో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని బట్టి భద్రతా సిబ్బందిని మోహరించాలి. ఈ ఎన్నికల్లో స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లు, భయాలకు గురికాకుండా ఓటువేసేందుకు ప్రజలకు విశ్వాసం కలిగించేలా భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలి. మొత్తంగా 55 వేలమంది వరకు పోలీసు, భద్రతా సిబ్బంది అవసరమవుతారు. 

నోటిఫికేషన్‌ వరకు... 
ఓటు నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌ అంటూ ఏమి ఉండదని, మార్పులు, చేర్పులు, కొత్త ఓటు నమోదుకు నోటిఫికేషన్‌ వెలువడే వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. గత పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసి లెక్కలు చూపించని వారి వివరాలు ఉన్నాయి. వారిపై నిఘా పెడతాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎంతమంది పోటీ చేసినా ఎన్నికలు నిర్వహిస్తాం. నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే బ్యాలెట్‌ను ముద్రిస్తామన్నారు. గతంలో నల్లగొండ జిల్లాలో 400 మందికిపైగా అభ్యర్థులు పోటీ చేసినా ఆ మేరకు పేపర్‌బ్యాలెట్‌ను ముద్రించి ఎన్నికలను సవ్యంగా నిర్వహించిన అనుభవం మనకుంది.  

ఎన్నికల సామగ్రి సిద్ధం... 
ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి మొత్తం సిద్ధమైంది. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి బ్యాలెట్‌ బాక్స్‌లు తెప్పించాం. బ్యాలెట్‌పత్రాల ముద్రణ మాత్రం కొంత క్లిష్టంగా ఉంటుంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థులు తేలాక బ్యాలెట్‌ పత్రాలను ముద్రిస్తాం. ఈ పత్రాల ముద్రణకు 3, 4 రోజుల సమయం పడుతుంది. అయినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. జిల్లాస్థాయిలో బ్యాలెట్‌ పత్రాల ముద్రణాకేంద్రాలను సైతం ఖరారు చేశాం. పోలింగ్‌ సిబ్బందికి నియామకపత్రాలు జారీచేశాం.  

గులాబీ రంగే ఉంటుంది... 
గతం నుంచే ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలను గులాబీరంగు బ్యాలెట్‌పేపర్‌తో నిర్వహిస్తున్నాం. అందువల్ల ఈసారి కూడా వీటిరంగు అదే ఉంటుంది. ప్రస్తుతం పింక్‌ కలర్‌ ఒక పార్టీకి సంబంధించిన రంగు అయినా గతం నుంచి ఇదే పద్ధతిలో సాగుతున్నందున దానినే కొనసాగిస్తాం. జడ్పీటీసీ ఎన్నికలను తెలుపురంగు బ్యాలెట్‌ పేపర్‌తో నిర్వహిస్తాం. ఈ రంగులు కొత్తగా ఇచ్చినవి కాదు. గతం నుంచి కొనసాగుతున్నవే.

23 రోజుల్లో పూర్తి 
ఎన్నికల నిర్వహణకు 15 రోజులు, మూడో నోటిఫికేషన్ల విడుదలకు 8 రోజులు కలుపుకుని మొత్తం పరిషత్‌ ఎన్నికల ఓటింగ్‌ 23 రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే ఓటర్ల జాబితాలను అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో విడుదల చేసి ప్రదర్శించాం. వీటిని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందజేశాం. ఓటరు జాబితా ఇంకా ఎవరికైనా కావాలంటే తగిన రుసుం చెల్లించి తీసుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. 18న పోలింగ్‌ కేంద్రాల తుదిజాబితా విడుదల చేస్తాం. బ్యాలెట్‌ పేపర్‌ ప్రింటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశాం.

పోలింగ్‌ సిబ్బందిని నియమించడంతోపాటు రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లకు, ఇతర అధికారులకు శిక్షణ కూడా పూర్తవుతుంది. ప్రతి మండలంలో ఒక్కో జెడ్పీటీసీ సీటు ఉంటుంది కాబట్టి ప్రతి మండలానికి ఒక రిటర్నిం గ్‌ అధికారి, మూడు ఎంపీటీసీ స్థానాలకు కలిపి ఒక ఆర్వో ఉంటారు. మిగిలిన పోలింగ్‌ సిబ్బంది, అధికారులకు త్వరలోనే శిక్షణ పూర్తవుతుంది. ఎన్నికల నిర్వహణకు (మొత్తం మూడు విడతలకు కలుపుకుని) 1.80 లక్షల సిబ్బంది అవసరం అవుతారు. దీనికి సంబంధించి సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

మరిన్ని వార్తలు