21 జిల్లాల్లో 3 విడతలు

17 Apr, 2019 04:21 IST|Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ షెడ్యూల్‌ జారీకి ఎస్‌ఈసీ సన్నాహాలు 

మేడ్చల్‌ జిల్లాలో ఒకే విడతలో, మిగతా 11 జిల్లాల్లో 2 విడతల్లో  \

535 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మూడు విడతల్లో పరిషత్‌ ఎన్నికలు జరగనున్నాయి. 10 జిల్లాల్లో 2 విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో మాత్రమే (4 జెడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు) ఒకే విడతలో ఎన్నికలు నిర్వ హిస్తారు. గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నిర్వహించనున్న సమావేశంలో పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి స్పష్టత రానుంది. తదనుగుణంగా 20న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ విడుదల చేయనుంది. జిల్లాలు, మండలాల వారీగా 3 విడతల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ అందజేసింది. దీనికి అనుగుణంగానే 3 విడత ల్లో ఏయే జిల్లాలు, మండలాల్లో ఏయే తేదీల్లో ఎన్నికలు జరపాలనే అంశంపై ఏర్పాట్లు చేస్తోంది.  

తేలిన ఎంపీటీసీ స్థానాల లెక్క... 
రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీపీ) ల పరిధిలో 535 మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ)లున్నాయి. ఈ మండలాలనే 535 జెడ్పీటీసీ నియోజకవర్గాలుగా పరిగణిస్తారు. 535 మండలాల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలున్నాయి. 535 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 32 జిల్లాల పరిధిలో 32,007 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. 400 మంది ఓటర్లున్న పోలింగ్‌ స్టేషన్లలో ముగ్గురు, 600 మంది ఓటర్లున్న పోలింగ్‌ కేంద్రాల్లో నలుగురు చొప్పున మొత్తం 54 వేల పోలీస్‌ సిబ్బంది అవసరమవుతారు. పోలింగ్‌ విధుల కోసం లక్షన్నర మంది సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు.  

విడతల వారీగా పరిషత్‌ ఎన్నికలు... 
మొదటి విడతలో 212 జెడ్పీటీసీ, 2,365 ఎంపీటీసీ స్థానాలు; రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2,109 ఎంపీటీసీ స్థానాలు; మూడో విడతలో 124 జెడ్పీటీసీ, 1,343 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

జిల్లాల వారీగా మూడు విడతల ఎన్నికలు... 

మూడు విడతలు: నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, ములుగు, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్, వనపర్తి, మెదక్‌.  

రెండు విడతలు: రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్‌ అర్బన్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల. 

ఒకే విడత: మేడ్చల్‌–మల్కాజ్‌గిరి.

మరిన్ని వార్తలు