పరేషాన్‌ నం.1 బిందాస్‌ పార్కింగ్‌!

19 Jun, 2017 01:03 IST|Sakshi
పరేషాన్‌ నం.1 బిందాస్‌ పార్కింగ్‌!

అపార్ట్‌మెంట్‌వాసుల పల్స్‌ ‘రేటింగ్‌’.. అక్రమ పార్కింగ్‌లతో తల పట్టుకుంటున్న నగర జీవి
- అత్యధిక అపార్ట్‌మెంట్‌వాసుల ఇబ్బంది ఇదే..
- తర్వాతి స్థానంలో మందుబాబుల ఆగడాలు, ట్రాఫిక్‌
- వెయ్యి అపార్ట్‌మెంట్లలో అధ్యయనం చేసిన పోలీసు శాఖ


పోలీసుల దృష్టికి వచ్చిన అపార్ట్‌మెంట్‌వాసుల సమస్యలివీ..
సందర్శించిన అపార్ట్‌మెంట్లు 1,000
వివిధ రకాల ఇబ్బందులు ఉన్నాయన్న సంఘాలు 630
అక్రమ పార్కింగ్‌ సమస్యగా ఉందన్న అపార్ట్‌మెంట్‌ సంఘాలు 169
మందుబాబుల ఆగడాలు 115
ట్రాఫిక్‌ ఇబ్బందులు 65
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం 63

సాక్షి, హైదరాబాద్‌: మహానగరం.. కోటి జనాభా.. వారిలో మెజారిటీ మధ్యతరగతి ప్రజలు ఉంటోంది అపార్ట్‌మెంట్లలోనే.. మరి అందులో నివసిస్తున్న వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటో తెలుసా? అక్రమ పార్కింగ్‌! అపార్ట్‌మెంట్‌ భవనాల ముందు అడ్డదిడ్డంగా పార్కింగ్‌ చేస్తున్న వాహనాలు నగరజీవికి తలనొప్పిగా మారాయి. అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నవారి ఇబ్బందులపై పోలీసు శాఖ తాజాగా ఓ అధ్యయనం చేసింది. సుమారు వెయ్యి అపార్ట్‌మెంట్లకు వెళ్లి అక్కడి అసోసియేషన్లను, జనాన్ని కలిశారు. వారికి ఎదురవుతున్న, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లలేని ఇబ్బందులు ఏమున్నాయని ఆరా తీశారు.

మొత్తం 32 అంశాలను ఎంపిక చేసుకుని ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అక్రమ పార్కింగ్‌ అని తేలింది. ఆ తర్వాత స్థానంలో ‘మందుబాబులు’నిలిచారు. తప్పతాగి వారు చేస్తున్న గోలతో ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు. గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మద్యం షాపులు ‘ఓపెన్‌ బార్‌’లా మారడం, వాటి ముందు మందుబాబుల ఆగడాలతో జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు, జీహెచ్‌ఎంసీ సంబంధిత సమస్యలు, శబ్ద కాలుష్యం తదితరాలు నిలిచాయి.

పరిష్కారానికి కమ్యూనిటీ పోలీసింగ్‌..
నగరంలో మొత్తం 60 ఠాణాలుండగా.. 370 రక్షక్, బ్లూకోల్ట్స్‌ వాహనాలున్నాయి. రెండున్నరేళ్ల నుంచి సిటీలో కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానం అమలవుతోంది. ఈ బాధ్యతల్ని క్షేత్రస్థాయిలో గస్తీ విధులు నిర్వర్తించే పెట్రోలింగ్‌ వాహనాలతోపాటు బ్లూకోల్డ్స్‌ సిబ్బందికి అప్పగించారు. వీరు నిత్యం తమ పరిధుల్లోని ప్రాంతాల్లో తిరుగుతూ కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘాలు, వర్తక/వాణిజ్య సంఘాలు, ఇతర కమ్యూనిటీలను కలిసేవారు. పోలీసు విభాగం చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటు నేరాల నిరోధానికి సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేసేవారు.

అయితే, ఇది పూర్తిస్థాయి కమ్యూనిటీ పోలీసింగ్‌ కాదని నగర కొత్వాల్‌ ఎం.మహేందర్‌రెడ్డి భావించారు. ఫలితాలతో కూడిన కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌ కేంద్రంగా సపోర్ట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలు, పోలీసుల వద్దకు వచ్చి జనం చెప్పుకోలేని ఇబ్బందులను క్షేత్రస్థాయిలోని పోలీసు సిబ్బంది గుర్తిస్తారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతల్ని సపోర్ట్‌ సెంటర్‌ ద్వారా అధికారులకు అప్పగిస్తారు. ఒకవేళ సమస్య పరిష్కారం పోలీసుల పరిధిలో లేకుంటే దాన్ని సంబంధిత విభాగం దృష్టికి తీసుకువెళ్తారు. గత వారమే ఈ వినూత్న విధానాన్ని ప్రారంభించారు. నగరవాసుల ఇబ్బందులపై పోలీసులు ప్రయోగాత్మకంగా అపార్ట్‌మెంట్ల వద్ద అధ్యయనం చేశారు.

మరిన్ని వార్తలు