పార్కింగ్‌కు ‘మార్కింగ్’

25 Sep, 2014 01:44 IST|Sakshi
  • పార్కింగ్ లాట్ల వద్ద పూర్తి వివరాలతో బోర్డులు  
  •  అక్రమ వసూళ్లకు త్వరలో జీహెచ్‌ఎంసీ చెక్
  • సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు పక్కన బండి పెడితే చాలు చేతిలో చీటి పెట్టి పార్కింగ్ చార్జ్ వసూలు చేసే అక్రమ దందాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నద్ధమయ్యారు.  జీహెచ్‌ఎంసీ పార్కింగ్  స్థలమేదో, కానిదేదో  తెలియకపోవడంతో ఎవరు పడితే వారు చార్జ్ వసూలు చేస్తున్నారు. రహదారులనే పార్కింగ్ లాట్లుగా మార్చిన జీహెచ్‌ఎంసీ వైఖరిని ఆసరా చేసుకుని, ప్రైవేట్ వ్యక్తులు కూడా నగరంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కూడళ్లలో ఈ దందాకు పాల్పడుతున్నారు.
     
    ఇకపై ఈ పరిస్థితి లేకుండా.. జీహెచ్‌ఎంసీ ఎంపిక చేసిన స్థలాల్లో పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకో సూచిస్తూ  బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు పార్కింగ్ ప్రదేశంలో అవసరమైన మార్కింగ్‌లు.. పార్కింగ్ ఫీజుల వివరాలతో పాటు సదరు పార్కింగ్ ఏరియాను టెండర్ల ద్వారా  జీహెచ్‌ఎంసీ ఎవరికి కేటాయించారు, తదితర వివరాలు ప్రముఖంగా కన్పించేలా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్  సోమేశ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా.. ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్కింగ్ కేటాయించిన స్థలం కంటే అదనపు స్థలాన్ని ఆక్రమించి వసూలు చేస్తున్నా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

    తొలిదశలో ఎంపిక చేసిన 47 పార్కింగ్ ఏర్పాట్లలో వీటిని అమల్లోకి తేనున్నట్లు వివరించారు. రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.  ఎవరైనా అక్రమ వసూలుకు పాల్పడితే జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసేందుకు సంబంధిత అధికారి ఫోన్ నంబరును కూడా అందుబాటులో  ఉంచనున్నారు.  జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు సైతం (040-21 11 11 11) ఫిర్యాదు చేయవచ్చు.  తద్వారా ప్రజలకు పార్కింగ్ బాదుడు తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు.  
     
     పార్కింగ్ లాట్ల వద్ద ఉండాల్సిన వివరాలు..
     పార్కింగ్ ఫీజు వివరాలు ప్రముఖంగా కనిపించేలా బోర్డుల ఏర్పాట్లు
         
     పార్కింగ్ సదుపాయం వేళల వివరాలు..
     
    ప్రస్తుత రేట్ల మేరకు, పార్కింగ్ ఫీజులు.. నాలుగు చక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 10, తర్వాత ప్రతి గంటకు రూ. 5
         
    ద్విచక్ర వాహనాలు మొదటి రెండు గంటలకు రూ. 5. ఆపై గంటకు రూ. 3.మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ధరల్లోనూ  మార్పులు చేసే అవకాశముంది.
         
    కొస మెరుపు: దాదాపు రెండేళ్ల  క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు సైతం ఇలాంటి ప్రకటనే చేశారు. కానీ అప్పట్లో ఇది అమలుకు నోచుకోలేదు.
     

మరిన్ని వార్తలు