హే గాంధీ.. ఇదేందీ

7 Jan, 2019 11:26 IST|Sakshi

గాంధీ ఆస్పత్రిలో ఇష్టారాజ్యంగా పార్కింగ్‌

అంబులెన్స్‌లకు దారి లేకుండా వాహనాలు నిలుపుతున్న వైనం  

తరచు కొట్లాటలు.. ఇబ్బంది పడుతున్న రోగులు  

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వాహనాల పార్కింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులను తీసుకువచ్చే అంబులెన్స్‌లకు దారి లేకుండా అత్యవసర విభాగం ఎదుట అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్‌ చేస్తున్నారు.  ఓపీ విభాగం ఎదుట కూడా ఇష్టారాజ్యంగా ఆటోలు పార్క్‌ చేస్తుండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెయిడ్‌ పార్కింగ్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోతో ఇక్కడ కూడా  పెయిడ్‌ పార్కింగ్‌ రద్దయింది.  ప్రతిరోజు సుమారు పదివేల మంది రోగులు వారి బంధువులు రాకపోకలు సాగిస్తారు. గతంలో పెయిడ్‌ పార్కింగ్‌ కాంట్రాక్టుదారు సుమారు 25 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి పార్కింగ్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించేవారు. పెయిడ్‌ పార్కింగ్‌ రద్దు కావడంతో వాహనదారులు ఆస్పత్రి ప్రాంగణంలో ఇష్టానుసారం వాహనాలను నిలుపుతున్నారు. ఇదేమని అడిగిన వారితో వాహనదారులు గొడవలకు దిగుతున్నాన్నారు.   

అంబులెన్స్‌కు దారేదీ  
గాంధీ ఆస్పత్రి ప్రధాన ద్వారం నుంచి ఓపీ విభాగం మీదుగా అత్యవసర విభాగానికి వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలను నిలుపడంతో అంబులెన్స్‌లకు దారిలేకుండా పోతోంది. అవుట్‌ పేషెంట్‌ విభాగం వద్ద స్ట్రెచర్లు, వీల్‌చైర్లపై రోగులకు తరలించేందుకు వీలు లేకుండా ర్యాంపుకు అడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేయడంతో రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అడ్డంగా పార్కింగ్‌ చేసిన వాహనదారులు తమతో గొడవకు దిగడంతోపాటు దాడులకు పాల్పడుతున్నారని సెక్యూరిటీ సిబ్బంది వాపోతున్నారు.  

ఆదాయానికి గండి..పెరిగిన పార్కింగ్‌ సమస్యలు  
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెయిడ్‌ పార్కింగ్‌ను రద్దు చేయడం మంచి విషయమే అయినప్పటికీ  పార్కింగ్‌ కాంట్రాక్టు ద్వారా ఆస్పత్రి అభివృద్ధి నిధికి వచ్చే ఆదాయానికి గండి పడింది. దీంతో పాటు పార్కింగ్‌ సమస్యలు తీవ్రస్థాయిలో పెరిగాయి.  

సమస్య పరిష్కారానికి  ప్రత్యేక ప్రణాళిక
గాంధీ ఆస్పత్రిలో పార్కింగ్‌ సమస్య తీవ్రంగా ఉందనేది వాస్తవం. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాము. పార్కింగ్‌ కోసం ఆరుగురు సెక్యూరిటీ సిబ్బందిని నియమించాం. వాహనదారులు కూడా విచక్షణా రహితంగా తమ వాహనాలను పార్కింగ్‌ చేయడం మానుకోవాలి.  
శ్రవణ్‌కుమార్, గాంధీఆస్పత్రి  సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు