చిలుకా చెప్పవా.. మా బతుకు జోస్యం!

3 Jul, 2018 03:00 IST|Sakshi
తాండూరులో జోస్యం చెప్పించుకునేవారు లేక ఖాళీగా కూర్చున్న ఆరెగొందిలీలు

సాక్షి, వికారాబాద్, బషీరాబాద్‌ : చిలుక జోస్యం చెప్పించుకోవడానికి ఒకప్పుడు వారి ముందు జనం చేయిచాపేవారు. ఇప్పుడు వారే చేయిచాపాల్సిన దుస్థితి నెలకొంది. కాలం తెచ్చిన మార్పులకు వారి బతుకులు చితికిపోయాయి. చిలుక జోస్యమే వృత్తిగా బతుకుబండిని నడిపిస్తున్న ఆరె గొందిలీల సంచార జీవితాలు దుర్భరంగా మారాయి. గతంలో గుంపులుగా వచ్చి చిలుక జోస్యం చెప్పించుకునేవారు. నేడు  రోజంతా కూర్చున్నా చేయిచాపి జాతకం చెప్పించుకునేవారే కరువయ్యారు.  ఆదాయం లేక పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో కొంతమంది వృత్తిని వదులుకోగా..మరికొందరు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని వదులుకోలేక జీవనం సాగిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల మంది జనాభా కలిగిన ఆరె గొందిలీల(బుడబుడకల) జీవన విధానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. 

మహారాష్ట్ర నుంచి మూడు శతాబ్దాల కిందట వలస వచ్చిన ఆరె గొందిలీలు వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం ఎక్మాయిలో స్థిరపడ్డారు. ఇక్కడ సుమారు 350 కుటుంబాలుండగా క్రమేపి బతుకుదెరువు కోసం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్‌తోపాటు ఆంధ్రాలోని కడప, కర్నూలు జిల్లాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాలను ఎంచుకొని చిలుక జోస్యం చెబుతూ జీవనం సాగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల కాలంలో జనం చిలుక జోస్యాలను ఆదరించడంలేదు. తద్వారా ఆ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వందల కుటుంబాలకు జీవనాధారం లేకుండాపోయింది. దీంతో నేటితరం యువకులు పట్టణాల్లో ఆటోలు నడుపుతూ, మహిళలు స్టీలు సామాన్లు, బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.  

ఆరెగొందిలీల చారిత్రక నేపథ్యం.. 
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో ఆరెగొందిలీలు కీలకంగా ఉండేవారని ప్రాచుర్యంలో ఉన్న గాధను బట్టి తెలుస్తోంది. తన సామ్రాజ్యంలోని ప్రజలు పాలనపై ఏమనుకుంటున్నారో కనుక్కొని రావాలని ఆరెగొందిలీలను చక్రవర్తి ఆదేశించగా ఆరెగొందీలు మారువేషాల్లో కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లారు. వారిలో కొంతమంది తిరిగి మహారాష్ట్రకు వెళ్లగా మరికొంత మంది ఇక్కడే ఉండిపోయారు. ఇలా స్థిరపడినవాళ్లే నేడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. ప్రతి ఏడాది ఏరువాక పౌర్ణమి, మొహర్రం నాడు ప్రతి కుటుంబం ఎక్మాయి గ్రామానికి వచ్చి పండుగ చేసుకుంటుంది. తర్వాత మళ్లీ ఆయా జిల్లాలకు వెళ్తుంటాయి. 

అందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు... 
గొందిలీ కుటుంబాలు రాష్ట్రంలో రెండు వేల నుంచి మూడు వేల వరకు పెరిగాయి. వీరిలో సూర్యాపేట జిల్లాలో నివాసముంటున్న గొందిలీలు నిరాదరణకు గురైన తమను బీసీ ‘ఏ’ లో చేర్చాలని కోర్టు ద్వారా ప్రభుత్వంతో కొట్లాడారు. దీంతో సుమారు 500 కుటుంబాలను ప్రభుత్వం బీసీ‘ఏ’ జాబితాలో చేర్చింది. మిగతా జిల్లాల్లోని వారికి మాత్రం అధికారులు బీసీ ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదు. దీంతో వందల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందకుండా పోతున్నాయి.

బతుకు కష్టమైంది 
మాది ఎక్మాయి. 60 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జాతకాలు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. నాలుగైదేళ్లుగా చిలుక జోస్యం చెప్పించుకునేవారు కరువయ్యారు.  బతకడం కష్టంగా మారింది.  
– వకోరి శంకర్‌రావు, చిలక జ్యోతిష్యుడు, తాండూరు 

పిల్లలను చదివించలేకపోతున్నం 
మమ్మల్నీ బీసీ ‘ఏ’జాబితాలో చేర్చాలని చాలారోజుల నుంచి డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడంలేదు. దీంతో మా పిల్లలను చదివించుకోలేకపోతున్నం. సీఎం స్పందించి న్యాయం చేస్తారని నమ్ముతున్నం. 
 – ఇగ్వే శ్రీనివాస్, సిద్దిపేట 

బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చాలి 
రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది జనాభా ఉన్నం. మహారాష్ట్రలో బీసీ ఏ గ్రూపులో చేర్చింది. ఇక్కడి ప్రభుత్వం మా గొందిలీలను బీసీ ‘ఏ’గ్రూపులో చేర్చాలి. అందరికీ తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి కులం సర్టిఫికెట్లు జారీ చేయాలి.  
– భౌరి మోహన్, గొందిలీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు