తండ్రి ప్రేమ

2 May, 2020 04:37 IST|Sakshi

లాక్‌డౌన్‌ ఆవిష్కరణ

‘నెసెసిటీ ఈజ్‌ ద మదర్‌ ఆఫ్‌ ఇన్‌వెన్షన్‌’ అని ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో నిరూపితమైన విషయమే. అయితే కోవిడ్‌ 19 విజృంభణ నేపథ్యంలో మరోసారి రుజువైంది. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ తన రాష్ట్రంలోని ఓ తండ్రిని ప్రశంసిస్తూ పై నానుడిని ఉదహరించారు. త్రిపుర రాజధాని అగర్తలలో పార్థ సాహా తన కూతురి కోసం కొత్తరకం బైక్‌ తయారు చేశాడు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మనిషికి మనిషికీ మధ్య భౌతిక దూరం పాటించడం తప్పని సరి కావడంతో పార్థ తన కూతురిని స్కూలుకు తీసుకెళ్లడానికి పైన ఫొటోలో కనిపిస్తున్నట్లు బైక్‌కు రూపకల్పన చేశాడు.

పార్థ సాహా టీవీలు రిపేర్‌ చేస్తాడు. ఈ లాక్‌డౌన్‌ ఖాళీ సమయాన్ని అతడు ఇలా ఉపయోగించుకున్నాడు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత స్కూళ్లు తెరుస్తారు. లాక్‌డౌన్‌ పూర్తయినా సరే మనుషుల మధ్య సోషల్‌ డిస్టెన్స్‌ పాటించి తీరాల్సిందే. రద్దీగా ఉండే బస్సుల్లో కూతురిని స్కూలుకు పంపించడం తనకు ఇష్టం లేదని, తాను రూపొందించిన ఈ బైక్‌ మీదనే తీసుకెళ్తానని చెప్పాడు పార్థ సాహా. దీనికి సోషల్‌ డిస్టెన్సింగ్‌ బైక్‌ అని పేరు పెట్టాడతడు.

స్క్రాప్‌ నుంచి ఈ బైక్‌
పార్థ సాహా అగర్తలలోని పాత ఇనుప సామానుల దుకాణం నుంచి తూకానికి అమ్మేసిన ఒక బైక్‌ను కొన్నాడు.  కొద్దిపాటి మార్పులు చేసి, రెండు చక్రాల మధ్య ఒక మీటరు రాడ్‌ను పెట్టి వెల్డింగ్‌ చేయించాడు. ఈ బైక్‌ బ్యాటరీతో పని చేస్తుంది. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. బైక్‌ బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ కావడానికి మూడు గంటల సమయం పడుతుంది. ఒక సారి ఫుల్‌గా చార్జ్‌ చేస్తే ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. పార్థ సాహా తాను రూపొందించిన బైక్‌కు ట్రయల్‌ రన్‌లు పూర్తి చేసి, ఇప్పుడు ఈ బైక్‌ మీద కూతుర్ని ఎక్కించుకుని అగర్తలలో విహరిస్తున్నాడు.

ఈ బైక్‌ నగరంలో తిరుగుతుంటే కోవిడ్‌ 19 నివారణకు తీసుకోవాల్సిన సోషల్‌ డిస్టెన్స్‌ గురించి జనానికి మళ్లీ మళ్లీ గుర్తు చేసినట్లవుతోంది. పార్థ బైక్‌ ప్రజలను చైతన్యపరచడానికి బాగా ఉపయోగపడుతోందని, అవసరం కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. పార్థ ప్రయత్నాన్ని అవసరం చేసిన ఆవిష్కరణ అనుకుంటున్నాం, కానీ నిజానికి ఇది తండ్రి ప్రేమ నుంచి పుట్టిన ఆవిష్కరణ. సోషల్‌ డిస్టెన్సింగ్‌ ఈ బైక్‌ పెంచింది తండ్రీకూతుళ్ల మధ్య భౌతిక దూరాన్ని మాత్రమే. మానసికంగా ఇద్దరి మధ్య ఎంతో దగ్గరితనాన్ని తెచ్చి తీరుతుంది. తన కోసం తండ్రి చేసిన ఈ పని కూతురికి ఎప్పటికీ గర్వకారణమే.

 సైకిల్‌పై కుమార్తెతో పార్థా సాహా 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా