మా సంగతేంటి..?

22 Mar, 2019 07:46 IST|Sakshi

థర్డ్‌జెండర్‌ సంక్షేమంపై మేనిఫెస్టోల్లో చేర్చండి

ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి

రాజకీయ పార్టీలకు ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల సంఘాల వినతి

సాక్షి, సిటీబ్యూరో: ‘‘భిక్షాటన చేసినా, వ్యభిచారం చేసినా నేరమే. ఊళ్లో ఉన్నా, ఏ బస్తీల్లో తలదాచుకున్నా తరిమి కొడతారు. నగర శివార్లలోకి వెళ్లినా పోలీసులు మైకుల్లో అనౌన్స్‌ చేసి మరీ ఖాళీ చేయిస్తారు. మేం ఎక్కడ ఉంటే అక్కడ నేరాలు జరుగుతాయని వేధిస్తారు. నేరాలకు పాల్పడిన వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ట్రాన్స్‌జెండర్‌గా పుట్టినందుకు బతికే హక్కు లేకుండా చేస్తే ఎలా’’ అని తెలంగాణ ట్రాన్స్‌జెండర్స్‌ హక్కుల నేత  రచన ప్రశ్న ఇది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఆమె సాక్షితో మాట్లాడారు. మనుషులుగా గుర్తించాలని, అందరిలాగే ట్రాన్స్‌జెండర్లకు కూడా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని  ట్రాన్స్‌జెండర్లు  ఆవేదన వ్యక్తం చేశా రు.  ట్రాన్స్‌జెండర్ల సమస్యలను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో  ప్రస్తావించాలని డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై  చట్టసభల్లో గళం విప్పే లక్ష్యంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో  చంద్రముఖి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో  హైదరాబాద్‌ నుంచి పోటీకి వీరు దూరంగా ఉన్నప్పటికీ  తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ట్రా ల నుంచి తమ ప్రతినిధులు పోటీలో ఉన్నట్లు రచన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో వేలసంఖ్యలో ఉన్న ట్రాన్స్‌జెండర్లు, హిజ్రా ల సమస్యలకు రాజకీయ పార్టీలు పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. మనుషులుగా గౌరవప్రదమైన జీవితాన్ని అనుభవించే  హక్కుకు భరోసా కల్పించాలని  డిమాండ్‌ చేస్తున్నారు. 

రిజర్వేషన్లు కల్పించండి
గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 2,000 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు వేలకు పైగా ఉన్నట్లు అంచనా. కానీ ఎన్నికల కమిషన్‌ లెక్కల్లో మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే  ఓటర్లుగా నమోదై ఉన్నారు. సామాజిక వివక్ష కారణంగా చాలామంది తమను తాము హిజ్రాలుగా, ట్రాన్స్‌జెండర్లుగా ప్రకటించుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలంగాణ హిజ్రా, ఇంటర్‌సెక్స్, ట్రాన్స్‌జెండర్‌ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేందుకు, అన్ని రంగాల్లో అవకాశాలను పొందేందుకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది వారి ప్రధానమైన డిమాండ్‌. వెనుకబడిన వర్గాల జాబితాల్లో చేర్చాలని కోరుతున్నారు. ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, సామాజిక సంస్థలు, బహిరంగ స్థలాల్లో మహిళలకు, పురుషులకు  వేరు వేరుగా టాయిలెట్లు ఉన్నట్లుగా తమకు కూడా ప్రత్యేక వసతి కల్పించాలని ఆమె చెప్పారు. ఆసుపత్రుల్లో  ప్రత్యేక వైద్యులను ఏర్పాటు చేయాలని కోరారు. 

ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు
తమిళనాడుతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు. ఉపాధి కోసం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. గుర్తింపు కార్డులు, రేషన్‌ సదుపాయం, గృహవసతి కల్పిస్తున్నారు. కానీ తెలంగాణలోనే తీవ్రమైన వివక్ష కొనసాగుతోంది. మహిళలపై లైంగిక హింసకు, దోపిడీ, వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. కానీ ట్రాన్స్‌జెం డర్లపై దాడి జరిగితే నేరస్తులకు రెండేళ్ల శిక్ష మాత్ర మే పడుతోంది. ‘మమ్మల్ని మనుషులుగా బతకనివ్వండి. మా బతికే హక్కుకు  భరోసానివ్వండి అని సంఘం నాయకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు