వామపక్షాలు..‘ఉనికి’ పాట్లు

14 Jan, 2019 04:09 IST|Sakshi

క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును, కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉభయ కమ్యూనిస్టులు

పార్టీలకు పట్టున్న పంచాయతీలను నిలుపుకోవడంపై కసరత్తు....

సాక్షి, హైదరాబాద్‌: క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును, శ్రేణులను కాపాడుకునే ప్రయత్నాలతో పాటు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు నిమగ్నమమయ్యాయి. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీలకు పట్టున్న గ్రామాలు, కొన్ని దశాబ్దాల పాటు సంప్రదాయంగా మద్దతునిస్తున్న స్థానాలను కాపాడుకునే యత్నాలు చేపడుతున్నాయి.రాష్ట్రంలో వామపక్షాలకు ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో బలం ఉండేది. ఇవి కాకుండా వరంగల్, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో కూడా వాటికి కొంతమేర మద్దతు లభించేది.మారిన రాజకీయ పరిస్థితుల్లో అదంతా గత వైభవంగానే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో...
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పక్షాలు ఘోరపరాజయం పాలై, కనీసం చెరో సీటైనా గెలుచుకోలేకపోయాయి.వాటికి పట్టున్న నియోజకవర్గాల్లో సైతం పోలైన ఓట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పక్షాలు తమ వైఖరికి భిన్నంగా ప్రధాన రాజకీయపార్టీలతో పొత్తులు, ఎన్నికల అవగాహనల పేరిట అంటకాగుతున్నాయి. దీంతో ఆ పార్టీల్లోని నేతలు, కార్యకర్తల క్రమశిక్షణారాహిత్యం, ప్రలోభాలకు గురయ్యే మనస్తత్వం వామపక్షాల కేడర్‌లో కూడా ప్రవేశించింది. ఆ ప్రభావం వారి సైద్ధాంతిక, క్రమశిక్షణ నేపథ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీలు డోలాయమాన పరిస్థితుల్లో పడ్డాయి. ఉన్న కేడరును కాపాడుకోవడం ఆ నాయకత్వానికి పెను సవాలుగా మారింది.వాటి దుస్థితికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే అద్దంపట్టాయి. 

అవీ నిలబడవేమో...
పంచాయతీ ఎన్నికలు రాజకీయపార్టీల గుర్తులు లేకుండా జరుగుతున్నా తమకు గట్టి బలం, పట్టు న్న గ్రామాల్లో తమ ఉనికిని చూపేందుకు సీపీఐ. సీపీఎం నాయకత్వాలు గట్టిగా శ్రమించాల్సిన పరి స్థితులు ఏర్పడ్డాయి.తాము గతంలో గెలుచుకున్న పంచాయతీలను నిలబెట్టుకోవడం కూడా ఈ పార్టీ లకు సవాల్‌గానే మారుతోంది. సర్పంచ్‌ స్థానాల కు వేలంపాటలు, ఏకగ్రీవం పేరిట రాజకీయ ఒత్తి ళ్లు, కిందిస్థాయిలో కేడర్‌కు డబ్బు ప్రభావం ఇతర త్రా ప్రలోభాలు వాటిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ స్థితిలో తాము ఆశించిన స్థాయిలో పంచాయతీలు గెలుచుకోవడం సాధ్యం కాదని ఆ పార్టీ అంతర్గత చర్చల్లో ఇరుపార్టీల నాయకులే అంగీకరిస్తున్నారు.

కార్యకర్తలను సంరక్షిం చుకోవడం, పార్టీ మూలాల ను కాపాడుకోవడంపై పార్టీల నేతలు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం మద్దతుదారులు 200కు పైగా సర్పంచ్‌ స్థానాలు గెలుచుకోగా, సీపీఐ బలపరిచినవారు 150 వరకు పంచాయతీలు, వంద వరకు ఉప సర్పంచ్‌లు, వెయ్యివరకు వార్డుల్లోనూ గెలుపొందారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానాలు నిలబెట్టుకోవడం అంత సులభం కాదని వామ పక్షాల రాజకీయాలను అధ్యయనం చేస్తున్న రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు