పార్టీలు మారుతున్న నేతలు, అభ్యర్థులు!

11 Jan, 2020 09:00 IST|Sakshi
షబ్బీర్‌అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు

సాక్షి, ఎల్లారెడ్డి(నిజామాబాద్‌): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎల్లారెడ్డిలో రసవత్తరమైన రాజకీయం చోటు చేసుకుంది. ఏళ్లుగా టీఆర్‌ఎస్‌ జెండా మోసిన నేతలు కాంగ్రెస్‌లో చేరగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఎల్లారెడ్డి మున్సిపల్‌ టికెట్లలో రవీందర్‌రెడ్డి వర్గానికి మొండి చెయ్యే ఎదురైంది. తమ పార్టీలో టికెట్‌ లభించని ఆయన వర్గీయులు కాంగ్రెస్‌లో చేరారు. శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ డెలిగేట్‌ ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి ఒడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ మాజీ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, మంచిర్యాల విద్యాసాగర్, ముస్త్యాల రాజు, ప్యాలాల రాములు, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు రఫీఖ్‌ కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ గయాజుద్దీన్‌ కూడా షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పద్మ శ్రీకాంత్, గజ్జల రామచందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలు మారిన నేతలకు రెండు పార్టీలలో టికెట్లు లభించాయి. కొత్తగా చేరిన పార్టీలతో పాటు తమ పార్టీల నుంచి కూడా వీరిలో పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగా పార్టీలలో చేరిన వారితో పాటు గతంలో పార్టీ టికెట్లు ఆశించిన నాయకులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. దీంతో రెండు పార్టీలలో దాదాపు అన్ని స్థానాలలో రెబెల్స్‌ తాకిడి ఎక్కువైంది. ఇక బీజేపీ కూడా మున్సిపాలిటీలో 10 స్థానాలకు అభ్యర్థులను పోటీలో దించింది. జనరల్‌ మహిళలకు కేటాయించిన 8, 5 వార్డులకు బీజేపీ పోటీ చేయడం లేదు. మారిన సమీకరణాల నేపథ్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇన్నాళ్లూ తాము విబేధించిన వారితోనే కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడటం గందరగోళంగా మారింది.

టీఆర్‌ఎస్‌ నుంచి మున్సిపల్‌ చైర్మన్‌ రేసులో ఉన్న కుడుముల సత్యనారాయణ 7వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. కాగా చైర్మన్‌ స్థానాన్ని ఆశిస్తూ కొత్తగా పార్టీలో చేరిన పద్మ శ్రీకాంత్‌ 10వ వార్డు నుంచి తన నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి చైర్మన్‌ స్థానాన్ని ఆశిస్తున్న గయాజుద్దీన్‌ 12వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. చైర్మన్‌ రేస్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులు ఇద్దరికి తమ పార్టీ నుంచే రెబెల్స్‌ పోటు తప్పడం లేదు. నామినేషన్లు దాఖలు చేసిన తమ పార్టీ వారిని ఇతరులను విత్‌డ్రాలు చేయించేందుకు నేతలు పావులు కదుపుతున్నారు.   

ఒకే వార్డులో మాజీల పోరు  
కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో ఒకే వార్డులో తాజా, మాజీ చైర్మన్‌ల పోరు సాగనుంది. పట్టణంలోని 43వ వార్డులో తాజా మాజీ చైర్‌ పర్సన్‌ పిప్పిరి సుష్మ టీఆర్‌ఎస్‌ తరపున శుక్రవారం నామినేషన్‌ వేశారు. అదే వార్డు నుంచి మాజీ చైర్మన్‌ చీల ప్రభాకర్‌ కోడలు చీల రచన నామినేషన్‌ వేశారు. అయితే ఈ వార్డులో మాజీల పోరు సాగనుంది. ఇద్దరు అభ్యర్థులు వైశ్య వర్గానికి చెందినవారు. ఈ వార్డులో వైశ్యుల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఇద్దరు గెలుపు ధీమాలో ఉన్నారు.

మరిన్ని వార్తలు