కప్పగంతులకు..యమ గిరాకీ!

16 Nov, 2018 10:42 IST|Sakshi

జంప్‌జిలానీల ద్వారా ఓట్లు పడతాయో లేదో అంచనా లేని అభ్యర్థులు

బరిలో బలంగా ఉన్నామని చెప్పుకునేందుకు తిప్పలు

పార్టీలు మారుతున్న వారిలో అధికం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

ఇరు పార్టీల అభ్యర్థులతో బేరసారాలు

చివరకు ఎవరి పార్టీల్లోకి వారు చేరుకుంటున్న వైనం 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇప్పుడు జంప్‌జిలానీల కాలం నడుస్తోంది. జిల్లా  వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న తంతు ఇది. భుజాల మీద కండువాలు మార్చినట్టు పార్టీలు మారుతున్న ఈ దృశ్యాల వెనుక ఓ ఆర్థిక కోణం కూడా దాగుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమకు నియోజకవర్గంలో అనుకూలమైన వాతావరణం బాగుందని చెప్పుకునేందుకు చేసుకుంటున్న ప్రయత్నాలు.. ఎన్నికల్లో ఓ ఊపు తెచ్చేందుకు పడుతున్న పాట్లలో భాగంగానే ఈ చేరికలన్నీ ఉంటున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆయా గ్రామాల్లోని మాజీ సర్పంచులు, ఆయా మండలాల్లో ఎంపీటీసీ సభ్యులు, కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ సభ్యులు.. మాజీ ప్రజాప్రతినిధులు ఇలా.. పార్టీలు మారుతున్నవారిని ఆయా పార్టీల అభ్యర్థులు సంతృప్తి పరుస్తున్నారని చెబుతున్నారు.

నిన్నా మొన్నటి దాకా ఒక పార్టీ కండువాతో ప్రచారం చేసిన కొందరు నాయకులు ఒక్క రోజు తేడాలో పార్టీ మారిపోతున్నారు. వారి మెడలో కండువాలు మారిపోతున్నాయి. ఒక పార్టీకి చెందిన ఏ స్థాయి నాయకుడు పార్టీ మారితే.. అదే స్థాయిలో ఉన్న ఎదుటి పార్టీ నాయకున్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు డబ్బును నీళ్ల ఖర్చు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఇంకా మరికొందరైతే పార్టీ మారి పట్టుమని నాలుగైదు రోజులు గడవకుండానే తిరిగి వెనక్కి వచ్చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంత నేతల్లో ఈ ఒరవడి ఎక్కువగా కనిపిస్తోంది.
రూ.లక్షల్లో బేర సారాలు 
ముందస్తు ఎన్నికలు ఖాయమైన నాటినుంచి జిల్లావ్యాప్తంగా నిత్యం ఇదే దృశ్యం  అనివార్యంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌.. ఈ రెండు పార్టీల్లో జరుగుతున్న చేరికలు చర్చనీయాశం అవుతున్నాయి. సెప్టెంబరు ఆరో తేదీన ప్రభుత్వం రద్దు కావడం, వెనువెంటనే.. టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల వేడి మొదలైంది. ఈ వేడిని కొనసాగించడానికి ఇటు నుంచి అటు .. అటు నుంచి ఇరు పార్టీల్లోకి జరుగుతున్న కప్పగంతులు పూర్తిగా లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్నదేనని వాపోతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్ధులు, సంబంధిత అభ్యర్ధికి చెందిన పార్టీలు బలంగా ఉన్నాయని చెప్పుకోవడానికి తప్పడం లేదని అంటున్నారు. ఇటీవల ఒక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంట పనిచేసిన కొందరు పంచాయతీ వార్డు సభ్యులకు ఒక్కొక్కరికి కనీసం రూ.5లక్షలు చెల్లించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి తమ పార్టీలో చేర్చుకున్నారని సమాచారం.‘కాంగ్రెస్‌ వారు పార్టీ మారితే రూ.5లక్షలు ఇస్తామంటున్నారు. మీరెంత ఇస్తారు..? కనీసం రూ.7లక్షలన్నా కావాలి. లేదంటే మారుతాం..’ అని సదరు వార్డు సభ్యులు కొందరు రాయబేరం నడిపారని సమాచారం.

అంటే .. పార్టీ మారకుండా నిలబెట్టడానికి వారికి కనీసం రూ.40లక్షలు వెచ్చించాల్సి రావడంతో వదిలేశారని అంటున్నారు. ఇలా ప్రతి పార్టీలో కొనుగోళ్ల వ్యవహారం నడుస్తోందని చెబుతున్నారు. ‘వార్డు స్థాయి నాయకులను కాపాడుకోవడానికి అన్ని లక్షల రూపాయలు ఎక్కడినుంచి తెచ్చి పోయాలి. అదే డబ్బుతో ఎన్నికల ఖర్చులు వెళ్లిపోతాయి కదా..! ప్రజలకు మంచి చేసినప్పుడు.. అభివృద్ధి కనిపిస్తున్నప్పుడు నాయకులకు డబ్బులిచ్చి కాపాడుకోవాలన్న ఆరాటం ఎందుకు. ప్రజలనే నమ్ముకుంటే సరిపోతుంది కదా..’ అని ఓ పార్టీ అభ్యర్థి ‘ సాక్షిప్రతినిధి’తో వ్యాఖ్యానించారు. 
ఖర్చవుతున్న కండువాలే లెక్క!
కొత్తగా తమ పార్టీలోకి ఎందరు వచ్చారన్న లెక్క తేల్చేందుకు తాము వినియోగించిన పార్టీ కండువాలను లెక్క గడుతున్నారు. ప్రతి అభ్యర్థి వేల సంఖ్యలో కండువాలు తెప్పించారు. పార్టీ మారిన ప్రతి వారికి మెడలో పార్టీ కండువాలు కప్పడం ఆనవాయితీ. అయిపోయిన కండువాల సంఖ్యను బట్టి ఎంతమంది తమ పార్టీలోకి వచ్చారో ఓ లెక్కకు వస్తున్నారు.
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కప్పగంతులు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలకు ప్లాన్‌ చేశారని, శుక్రవారం కొన్ని చేరికల కార్యక్రమాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పార్టీలు మారుతున్నవారిలో అత్యధికులు బేరసారాల తర్వాతే కండువాలు మారుస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.           

మరిన్ని వార్తలు