మెట్‌పల్లిలో కాంగ్రెస్‌ టెన్షన్‌

11 Jan, 2020 08:13 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ‘ఏళ్ల తరబడి పార్టీ కోసం పని చేశాం..పదవులు త్యాగం చేశాం.. అన్ని ఎన్నికల్లో పార్టీ విజయంకోసం శ్రమించాం. మున్సిపల్‌ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి...’ అంటూ అన్ని పార్టీల్లోని ఆశావహులు సీనియర్లను వేడుకుంటున్నారు. కరీంనగర్‌ నగర కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు పోటీకి సై అంటున్నారు. ఈసారి తప్పనిసరిగా తమకే అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్దసంఖ్యలో పోటీదారులు తెరపైకి వస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను సీఎం కేసీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది. 

తాడోపేడో..
గెలుపు గుర్రాల పేరు మీద ఈ మధ్యనే పార్టీల్లో చేరిన వారికి గతంలో పార్టీకి సహకరించని వారికి టికెట్లు ఇవ్వొద్దు. మాకు టికెట్‌ ఇస్తే పార్టీ తరఫున పోటీ చేయడంతోపాటు వార్డుల్లో విజయం సాధిస్తామని అన్ని పార్టీల నేతలు సీనియర్‌ నేతలతోపాటు ఎమ్మెల్యేలను కలుస్తూ కోరుతున్నారు. లేదంటే తాడోపేడో తేల్చుకునేందుకు బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట,చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో సీనియర్, జూనియర్లు ఈదపా పోటీపడుతున్నారు. 

సీనియర్ల చుట్టూ ప్రదక్షిణలు 
గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అన్ని నియోజకవర్గాల్లో చాలా మంది టీఆర్‌ఎస్‌లోకి వలసపోయారు. మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేటర్‌లు, కౌన్సిలర్‌లు కూడా ఇతర పార్టీల్లో చేరారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికే ఈ దఫా టికెట్లు కేటాయించాలని ఎక్కువ మంది కోరుతున్నారు. అక్కడ అవకాశం రాక మళ్లీ పార్టీలోకి వచ్చే వారికి టికెట్లు ఇస్తూ ఇక్కడ పని చేస్తున్న వారికి మొండిచేయి చూపవద్దని నేతలను కలిసి  కోరుతున్నారు. బీజేపీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో మున్సిపాలిటీ పరిధిలో పురోగతి వచ్చింది. ఎక్కువ మంది సహకరించా రు. అభ్యర్థి గెలుపుకు కృషి చేశారు. డివిజన్‌లు, వార్డుల పరిధిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి ఈ దఫా అవకాశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజులుగా ఎంపీతో పాటు ఇతర సీనియర్‌ నేతల చుట్టూ తిరుగుతున్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ము న్సిపాలిటీలకు నియమించిన నేతలతో కలిసి పోటీచేసే అభ్యర్థులపై సమీక్షిస్తున్నారు. పార్టీలు సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తారా? లేదా గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తారో వేచి చూడాల్సిందే.  

ఛాన్స్‌ మిస్‌.. అనుకూలించని రిజర్వేషన్‌
జగిత్యాల: మూడుసార్లు వరుసగా గెలిచిన కౌన్సిలర్‌. ప్రస్తుతం రిజర్వేషన్‌ అనుకూలించకపోవడంతో ఛాన్స్‌ మిస్‌ అయింది. సతీమణిని పోటీలో నిలుపుదామనుకున్నా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుకావడంతో పోటీకి నిలిపే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీలో నిలబడలేదు. 46వ వార్డుకు చెందిన ములస్తం రాజేందర్‌ (గాజుల రాజేందర్‌) గతంలో 22వ వార్డు ప్రస్తుతం 46వ వార్డులో 2005, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి వరుసగా కౌన్సిలర్‌గా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. ప్రస్తుతం బీసీ మహిళ కావడంతో ఆ వార్డులో పలుకుబడి ఉండడంతో ఆయనకు పోటీచేసే అవకాశం లేకుండాపోయింది. ఆయన తరఫున బంధువులు పోటీలో ఉన్నారు.  కాంగ్రెస్‌ నుంచి మూడుసార్లు గెలుపొంది రాజేందర్‌ జగిత్యాల మున్సిపాలిటీలో మంచిపేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

మెట్‌పల్లి హస్తంలో టెన్షన్‌.. 
మెట్‌పల్లి(జగిత్యాల): మెట్‌పల్లి కాంగ్రెస్‌ పార్టీలో బీ–ఫారాల విషయంలో అయోమయం ఏర్పడింది. వీటిని తానే ఇస్తానని మాజీ ఎమ్మెల్యే రామ్‌లు ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న జువ్వాడి నర్సింగరావు వర్గీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేశారనే ఉద్దేశంతో రామ్‌లును పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా గురువారం గాంధీభవన్‌లో మాజీ ఎంపీ మధుయాష్కీతోపాటు మరికొందరు ముఖ్య నేతలతో రామ్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సస్పెన్షన్‌ ఎత్తివేయడంతోపాటు మెట్‌పల్లి మున్సిపల్‌కు సంబంధించిన కాంగ్రెస్‌ బీ–ఫారాలు రామ్‌లుకే ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు శుక్రవారం పట్టణానికి వచ్చిన రామ్‌లు బీ–ఫారాలు తానే ఇస్తానని ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేసిన అభ్యరులకు గుబులు పట్టుకుంది. ఇదిలా ఉంటే రామ్‌లు ప్రకటనతో ఖంగుతిన్న పలువురు అభ్యర్థులు దీనిపై జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావుకు ఫోన్లు చేసి ఆరా తీశారు. పార్టీ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న తామే బీ–ఫారాలు ఇస్తామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇరువురు భరోసా ఇచ్చినట్లు వారు పేర్కొంటున్నారు. మొత్తానికి స్థానిక కాంగ్రెస్‌లో కలకలం రేపిన రామ్‌లు వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. 

>
మరిన్ని వార్తలు