విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు!

30 Nov, 2017 09:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్‌ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న ప్రపంచ వ్యాపారసదస్సు (జీఈఎస్‌)లో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ కేటీఆర్‌ థ్యాంక్స్‌ చెప్పారు.


మన మెట్రో.. మన గౌరవం!
బుధవారం నుంచి నగరప్రజలకు అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్‌ మెట్రో గురించి కూడా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘తొలిరోజు హైదరాబాద్‌ మెట్రో అన్ని రికార్డులు బద్దలు కొడుతుందని, రెండోరోజు నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని నాకు చెప్పారు. కాబట్టి హైదరాబాద్‌ పోలీసులు, హైదరాబాద్‌ మెట్రో సంస్థ, ఎల్‌అండ్‌ కంపెనీ అప్రమత్తంగా ఉంటూ రద్దీని నియంత్రించాలి. పిల్లలు, వృద్ధులు, సాటి ప్రయాణికుల పట్ల ధ్యాస కనబర్చాలని హైదరాబాదీలను కోరుతున్నా. మన మెట్రో, మన గౌరవం’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌ మెట్రో తొలిరోజే 2 లక్షలమంది ప్రయాణికులతో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు