బస్టాండ్‌లో ప్రయాణికుడి మృతి

20 Jan, 2018 18:11 IST|Sakshi

మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సైతం డబ్బులులేని వైనం

హన్మకొండ ఎస్సై ప్రవీణ్, సాటి ప్రయాణికుల ఔదార్యం..

మృతదేహం సొంతూరికి తరలింపు

హన్మకొండ చౌరస్తా:  తన కొడుక్కి జబ్బు తగ్గాలని ఆస్పత్రిలో చికిత్స అందించిన తల్లి.. తన కొడుకుని తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం హన్మకొండ కొత్త బస్టాండ్‌లో చోటు చేసుకుంది. మృతుడి తల్లి అనసూర్య తెలిపిన ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వాజేడు వెంకటాపూర్‌ మండలంలోని రంగరాజుపల్లి కాలనీకి చెందిన గుండ్ల జయరాజ్‌(30) పెయింటింగ్‌ కార్మికుడు. కొద్దికాలంగా కేన్సర్‌తో భాదపడుతున్నాడు. జయరాజ్‌ను వైద్యుల సూచనల మేరకు రెండు నెలలుగా హైదబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స అందిస్తున్నారు. 

చికిత్స ముగియడంతో ఇంటికి తీసుకెళ్లవచ్చన్న వైద్య నిపుణుల సూచనల మేరకు జయరాజ్‌ను తల్లి అనసూర్య హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు తీసుకెళ్తోంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండ బస్టాండ్‌కు వారు చేరుకున్నారు. అయితే వారు బస్‌ కోసం ఎదురు చూస్తుండగా మృతుడు జయరాజ్‌ కాసేపు ఎండలో ఉంటానని తల్లి అనసూర్యకు చెప్పి బస్టాండ్‌ ఆవరణలోని సులభ్‌ కాంప్లెక్స్‌ వద్ద వెళ్లి కూర్చున్నాడు. అక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో గమనించిన తల్లి కేకలు వేస్తూ రోదిస్తుండంతో సాటి ప్రయాణికులు 108కు ఫోన్‌ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్, సిబ్బంది జయరాజ్‌ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ ఎస్సై ప్రవీణ్‌కమార్‌ మృతుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

దాతల సాయంతో ఇంటికి..
మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సైతం డబ్బులు లేకపోవడంతో ఎస్సై ప్రవీణ్‌కుమార్, సాటి ప్రయాణికులు కొంత మొత్తాన్ని సేకరించి రూ.8 వేలను జయరాజ్‌ తల్లికి అందించారు. అంతేకాకుండా అంబులెన్స్‌ను మాట్లాడి జయరాజ్‌ మృతదేహాన్ని సొంతూరికి తరలించారు. 

మరిన్ని వార్తలు