ఆ మూడు మెట్రో స్టేషన్లలో కిటకిట..

29 Nov, 2017 18:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరం వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెట్రో రైలు కూత పెట్టింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఊరించిన మెట్రో రైలు ఎక్కేందుకు నగరవాసులు ఉత్సాహం చూపించారు. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్లో, మరో రైలు మియాపూర్ స్టేషన్లో బయల్దేరాయి. తెల్లవారుజామే అయినప్పటికీ మియాపూర్‌, అమీర్‌పేట, నాగోల్‌ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న వారి ముఖంలో సంతోషం, ఇక నుంచి ప్రయాణం సాఫీగా సాగుతుందన్న భరోసా కనిపించింది. కుదుపుల్లేని, ఏసీ ప్రయాణాన్ని ప్రయాణికులు ఆస్వాదించారు.

ఇక తొలి టికెట్ కొన్న ప్రయాణీకుడికి మెట్రో అధికారులు గిఫ్ట్ అందజేశారు.  ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరగనున్నాయి. మెట్రో రాకతో నాగోలు నుంచి అమీర్‌పేట ప్రయాణ సమయం 42 నిమిషాలకు తగ్గిపోయింది. మెట్రో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి పది గంటల వరకు నడవనున్నాయి. ప్రతీ 15 నిమిషాలకో రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. రైల్లో ఒకేసారి వెయ్యి మంది వరకు ప్రయాణించవచ్చు.

మరోవైపు తొలిసారి మెట్రో ఎక్కిన హైదరాబాదీలు...ఫొటోలు, సెల్ఫీలు, వాట్సాప్, ఫేస్‌బుక్‌ అద్యంతం సంతోషాల షేరింగే కనిపించింది. ఫస్ట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఒకరంటే, గాల్లో తేలినట్టుందే అని మరొకరు కవితాత్మకంగా పోస్టింగ్‌లు పెట్టారు. ఆనందం, సంతోషం ఎలా ఉన్నా.. టికెట్ ధరలు మాత్రం కొందరిని ఆందోళనకు గురి చేశాయి. ఆర్టీసీ బస్సుల ధర కంటే ఎక్కువున్నాయని కొందరంటే, సమయానికి చేరుకుంటాంలే అని మరికొందరు అన్నారు. ఇక పార్కింగ్ విషయంలో ఇంకాస్తా క్లారిటీ రావాలంటున్నారు మరికొందరు. స్టేషన్ల పరిధిలో స్మార్ట్ బైకులు అందుబాటులో ఉన్నా.. తమ సొంత వాహానాల పార్కింగ్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు