హైహై మెట్రో

10 Sep, 2019 11:50 IST|Sakshi

ఆదరణ అదుర్స్‌   

వారానికి 5వేల మంది చొప్పున పెరుగుతున్న ప్రయాణికులు   

సాక్షి, సిటీబ్యూరో: మెట్రోకు సిటీజనుల ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ప్రతివారం సరాసరిన మెట్రో ప్రయాణీకుల సంఖ్యలో 5వేల మేర పెరుగుదల నమోదవుతోందని మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్, నాగోల్‌–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్న విషయం విదితమే. ఈ మార్గంలో నిత్యం సుమారు 3లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నాయి. ఖైరతాబాద్‌ మహాగణపతిని వీక్షించేందుకు వేలాది మంది మెట్రో రైళ్లలోనే తరలివస్తున్నారని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

ఆదివారం అత్యధికంగా ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లో సుమారు 70వేల మంది ప్రయాణికులు ఎంట్రీ, ఎగ్జిట్‌ అయ్యారని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్య, నిర్వహణ సిబ్బంది సంఖ్యను పెంచామన్నారు. ప్రతి నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలు ఈ రెండు రూట్లలో అందుబాటులో ఉందన్నారు. చివరి మెట్రో రైలు అమీర్‌పేట్‌ నుంచి రాత్రి 11:30 గంటలకు ఎల్బీనగర్, నాగోల్‌ మార్గాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 4లక్షల మార్కును చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని, అక్టోబర్‌లో హైటెక్‌సిటీ–రాయదుర్గం మార్గంలోనూ మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు