పక్కపక్కనే ప్రత్యేక కిట్లతో!

18 May, 2020 03:49 IST|Sakshi

మధ్య సీటు వదిలేసే నిబంధన వద్దు

కేంద్రానికి విమానయాన సంస్థల ప్రతిపాదన?

భౌతికదూరం కంటే ఇదే మేలని సూచన

లాక్‌డౌన్‌ నష్టాల నేపథ్యంలో కొత్త ఆలోచన

సాక్షి, హైదరాబాద్‌: భౌతిక దూరం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. దాన్ని పాటించకుంటే కరోనా కాటేసే ముప్పు.. అనుసరిస్తే వాణిజ్య పరంగా నష్టాల దెబ్బ. ఇప్పుడు విమానయాన రంగంలో ఇది పెద్ద సమస్యగా మారింది. దీనికి విమానయాన సంస్థలు పరిష్కారంగా ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాణికులు పూర్తి రక్షణ కిట్లు ధరిస్తే కరోనా వ్యాపించే అవకాశం ఉండదని, అప్పుడు భౌతిక దూరం కూడా అవసరం లేదన్నది దాని సారాంశం.

కరోనా బాధితులకు చికిత్స చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేక పీపీఈ కిట్లు ధరిస్తారు. అలాంటి నమూనాలో ఉండే సాధారణ రక్షణ తొడుగులు ధరించటం ద్వారా ప్రయాణికులు పక్కపక్కనే కూర్చున్నా ఇబ్బంది లేదన్నది ఆ సంస్థల యోచన. ఇందుకు ఖరీదైన పీపీఈ కిట్లు కాకుండా, తక్కువ ఖర్చుతో రూపొందే సాధారణ ఏర్పాట్లు కూడా సరిపోతాయని పేర్కొంటున్నాయి.ప్రయాణికులకు వాటిని అందుబాటులో ఉంచుతామని, వాటిని ధరించి ప్రయాణిస్తే వైరస్‌ సోకిన వారు న్నా, ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకే అవకాశం లేదని పేర్కొం టున్నాయి. ఈ మేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విమానయాన సంస్థలు ప్రతిపాదించాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయా సంస్థలు అధికారికంగా వెల్లడించలేదు.

తీవ్ర నష్టాల భయంతో..
కరోనా దెబ్బకు విమానయానరంగం కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మనదేశంలోని ఎయిర్‌లైన్స్‌ సం స్థలు దాదాపు రూ.25 వేల కోట్ల వరకు నష్టపోయాయని అం చనా. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలిం పులతో క్రమంగా విమానాలు గాల్లోకి ఎగిరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో డొమెస్టిక్‌ విమానాలు ఇప్పటికే ఎగురుతుండగా, తాజాగా మనదేశంలో కూడా సిద్ధమయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ, వాటికి అనుమతించినా, అది లాక్‌డౌన్‌ సడలిం పుల్లో భాగంగానే తప్ప లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేయలేదు. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి నిబంధనలకు లోబడే అవి ఎగరాల్సి ఉంది. అంటే, కచ్చి తంగా ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందే. మూడు సీట్ల వరుసలో మధ్య సీటు వది లేసి ఇద్దరు ప్రయాణికులు అటూ ఇటూ కూర్చోవాల్సి ఉంటుంది.

ఇలా చేస్తారట..
ప్రయాణికులు విమానం ఎక్కేముందే వారికి ప్రత్యేక కిట్‌ ఇస్తారు. అందులో తల నుంచి కాలివరకు తేలికపాటి ప్రత్యే క తొడుగు ఉంటుంది. గ్లౌజ్‌లు, ముఖం వద్ద ప్రత్యేక ట్రాన్స్‌పరెంట్‌ కవచం ఉంటుంది. శానిటైజ్‌ చేసుకున్నాక వీటిని ధరిం చాల్సి ఉంటుంది. దేశీయంగా విమానాల గరిష్ట ప్రయాణ సమ యం దాదాపు రెండున్నర గంటలు. ఈ సమయం లో ప్రయాణికులు పక్కపక్కనే ఉన్నా, తుమ్మినా, దగ్గినా తుంపరలు పక్కవారిపై పడకుండా ఆ తొడుగులు అడ్డుకుంటాయని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. సాధారణంగా చిన్న విమానాల్లో సీట్ల మధ్య దూరం అంతగా ఉం డదు. మధ్యలో ఒక సీటు వదిలేసినా, భౌతిక దూరం నిబంధనల ప్రకారం అది 2 మీటర్ల ఎడం రాదు. వెరసి అది ఆ నిబంధనను పూర్తిగా సంతృప్తి పరచదు. దాని కంటే ఈ ప్రత్యేక తొడుగు ధరించి పక్కపక్కనే కూర్చోవటం ఎక్కువ సురక్షితమని పేర్కొన్నట్లు సమాచారం. విమానం దిగిన తర్వాత ఎగ్జిట్‌ అయ్యే చోట ఏర్పాటు చేసే ప్రత్యేక డస్ట్‌బిన్‌లో ప్రయాణికులు ఆ తొడుగును వదిలేయాల్సి ఉంటుంది. వాటిని ప్రత్యేక పద్ధతిలో సిబ్బంది ధ్వంసం చేస్తారు.

అసలే నష్టాలు.. ఆపై లాక్‌డౌన్‌ కష్టాలు..
దేశంలోని చాలా విమానయాన సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఎయిరిండియా సహా చాలా ప్రైవేటు సంస్థలు ఏటా నష్టాల లెక్కలు అప్పచెబుతున్నాయి. ఇదే సమయంలో కరోనా దెబ్బ కోలుకోలేనంతగా కుంగదీసింది. గత 55 రోజులుగా విమానాశ్రయాలు మూతపడే ఉండటంతో భారీ నష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు భౌతిక దూరం పేరుతో మధ్యలో ఒక సీటు వది లేస్తే ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గి నష్టాలు మరింత పెరుగుతాయని పేర్కొంటున్నాయి. 180 సీట్లు ఉండే విమానాల్లో భౌతిక దూరం వల్ల 120 మందే ప్రయాణించాల్సి ఉంటుంది. 120 సీట్లుండే చోట 80 మందికే అనుమతిస్తారు. వెరసి 33.3% టికెట్‌ రెవెన్యూను వదులుకోవాల్సి ఉంటుంది. కొన్ని విదేశీ విమానయాన సంస్థలు కూడా మధ్యలో ఓ సీటు వదిలేసేందుకు ఇష్టపడట్లేదు. వదిలేసే బదులు ఆ సీటును వెనక్కి తిప్పటం వల్ల సమస్య ఉండదన్న ఆలోచన చేస్తున్నాయి. అంటే ఇద్దరు ప్రయాణికులు కాక్‌పిట్‌ వైపు చూస్తూ కూర్చుంటే, మధ్య ప్రయాణికుడు వెనుకవైపు చూస్తూ కూర్చుంటాడన్న మాట. ఈ ఆలోచనకు కూడా ఇంకా ఆమోదం రాలేదు.

టికెట్‌పై అదనంగా చార్జి
వీటి కొనుగోలుకు అయ్యే వ్యయంతో కొంతమొత్తం విమానయాన సంస్థలు భరించనుండగా, మరికొంత మొత్తం టికెట్‌పై అదనంగా చార్జి చేయనున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి టికెట్‌పై రూ.300 అదనంగా చార్జి చేయనున్నట్లు తెలిసింది. దీనిపై ఇటు విమానయాన సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితిలో భౌతికదూరం నిబంధనకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. ఈ ప్రతిపాదన నిజమే అయితే, దాని విషయంలో సానుకూలత ఉండే అవకాశం తక్కువే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు