పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్

12 Oct, 2014 00:37 IST|Sakshi
పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఎస్సెమ్మెస్ అలర్ట్

21 రోజుల్లో విచారణ పూర్తి : కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : ఇకపై పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటికప్పుడు దాని వివరాలు ఎస్‌ఎమ్‌ఎస్‌ల రూపంలో అందనున్నాయి. పాస్‌పోర్టు ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఆగింది, ఇంకా ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుంది ఇలాంటి ప్రశ్నలకు చెక్‌పెట్టేందుకు ‘ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్’ అనే పద్దతికి నగర పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ విధానాన్ని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో మాట్లాడుతూ పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టినట్లు కమిషనర్ వెల్లడించారు. దరఖాస్తుదారులకు పాస్‌పోర్టు చేతికందిన తరువాత ఉన్నతాధికారులు స్వయంగా ఫోన్‌చేసి తమ సిబ్బంది పనితీరుపై ఆరా తీస్తారన్నారు. తద్వారా పాస్‌పోర్టు విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. పాస్‌పోర్టు విచారణను 21 రోజు ల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.

 ఎస్‌ఎమ్‌ఎస్ అలర్ట్ ఇలా....

►పాస్‌పోర్ట్ పొందాలకున్న వ్యక్తి ముందుగా పాస్‌పోర్టు సేవా కేంద్రం(పీఎస్‌కే)లో తమ దరఖాస్తులను అందజేస్తారు.
► నగర స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) ప్రధాన కార్యాలయానికి చేరిన దరఖాస్తులను విచారణ నిమిత్తం స్టేషన్‌ల వారిగా పంపిస్తారు.
► పంపేముందు దరఖాస్తుదారుడి సెల్ నంబర్‌కు అధికారులు ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌ను పంపిస్తారు. ‘‘పాస్‌పోర్టు కోసం మీరు పెట్టుకున్న దరఖాస్తు ఎస్బీ కార్యాలయానికి పలానా తేదీన చేరింది. విచారణ కోసం మీ వద్దకు ఎస్బీ అధికారి ఎప్పు డు, ఏ సమయంలో ఇంటికి రావాలో తెలపండి’’ అని ఎస్‌ఎమ్‌ఎస్‌లో ఉంటుంది. దరఖాస్తుదారుడు తనకు వీలున్న సమయాన్ని తిరిగి ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా ఎస్బీ అధికారులకు తెలియజేస్తాడు.
► తమ సిబ్బంది వల్ల ఏమైనా సమస్యలు ఏర్పడితే పలానా ఉన్నతాధికారి సెల్‌కు ఫోన్‌చేసి ఫిర్యా దు చేయవచ్చని కూడా ఎస్‌ఎమ్‌ఎస్ పంపిస్తారు.
► విచారణ అనంతరం దరఖాస్తుదారుడిపై ఏమైనా క్రిమినల్ రికార్డు ఉంటే ఆ విషయాన్ని ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా తెలియజేస్తారు.
►పాస్‌పోర్టుకోసం అర్హత పొందితే క్లియరె న్స్ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టు కార్యాలయానికి పంపి,  ఎస్సె మ్మెస్ ద్వారా తెలియజేస్తారు.
► చివరకు పాస్‌పోర్టు అందిన తరువాత కూడా ఎస్బీ కార్యాలయం నుంచి ఉన్నతాధికారి నేరుగా దరఖాస్తుదారుడికి ఫోన్‌చేసి తమ సిబ్బంది వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కున్నారా, మంచిగా సేవలు అందించారా, మా సేవలతో ఎంతమాత్రం సంతృప్తి వ్యక్తపరుస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకుంటారు.
 

మరిన్ని వార్తలు