విలీనం.. రచ్చ

19 May, 2014 02:34 IST|Sakshi
విలీనం.. రచ్చ

 యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఆధీనంలోని పాతగుట్ట దేవస్థానం విలీనం వివాదం ముదురుతోంది. తమ దేవస్థానాన్ని ప్రధాన దేవస్థానంలో విలీనం చేయాలని కొంతకాలంగా పోరాటం చేస్తున్న పాతగుట్ట సిబ్బంది కోరికను కోర్టు అంగీకరించి అనుకూలంగా తీర్పునిచ్చింది. తీర్పు అమలులో తీవ్ర జాప్యం జరిగింది. మొదటి నుంచీ విలీనాన్ని వ్యతిరేకిస్తున్న గుట్ట ఉద్యోగులు తీర్పుపై స్టే తెచ్చారు. దీంతో వివాదం మరింత రాజుకుంది. పాతగుట్ట సిబ్బంది ఆందోళనకు దిగడం.. భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవడంతో గొడవ మరింత తారస్థాయికి చేరింది.
 
 భువనగిరి/యాదగిరికొండ, న్యూస్‌లైన్  : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధాన దేవస్థానంతోపాటు పాతగుట్ట దేవస్థానం ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాలకు ఉద్యోగులు, సిబ్బంది వేర్వేరుగా ఉన్నారు. రెండింటికి ఈఓ ఒక్కరే ఉన్నప్పటికీ ఎక్కడి ఆదాయం అక్కడే. ఎక్కడివారు విధులు అక్కడే నిర్వహించాలి. చాలాకాలంగా పాతగుట్ట ఆలయాన్ని యాదగిరిగుట్ట ప్రధాన దేవస్థానంలో కలపాలని ఆక్కడి ఉద్యోగులు కోరుతున్నారు. దీనిని గుట్ట ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. విలీనం చేస్తే సీనియారిటీ, బెనిఫిట్స్ విషయంలో అన్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. అయితే ఇరుదేవస్థానాల సిబ్బంది మధ్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 1991 నుంచి 2014 వరకు...

1989లో పాతగుట్ట ఆలయాన్ని 6బీ ఆలయాల  నుంచి  6ఏ ఆలయాలలోకి (ప్రధాన దేవస్థానంలోకి) మార్చారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ప్రభుత్వానికి సైతం నివేదిక పంపించింది. దీనికి 1990లో ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.  ఈ క్రమంలో 1991లో పాతగుట్ట దేవస్థానం సిబ్బంది సాంకేతికంగా విలీనం చేయాలని ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పది సంవత్సరాలు నడిచింది. ఈ క్రమంలో విలీనం చేయకూడదని 2001లో యాదగిరిగుట్ట ప్రధాన దేవస్థానం ఉద్యోగులు కోర్టుకెక్కారు. 2010లో హైకోర్టు యాదగిరిగుట్టలో పాత గుట్టను విలీనం చేసుకోవాలని  తీర్పు చెప్పింది. కాగా, 2001లో వేసిన పిటిషన్ కోర్టులో ఉండగానే మరోమారు యాదగిరిగుట్ట ఉద్యోగులు 2006లో ఈఓ, దేవాదాయ శాఖ  కమిషనర్‌కు వ్యతిరేకంగా మరో కేసు వేశారు. దీనిపై 2012లో హైకోర్టు తీర్పునిచ్చింది. దేవస్థానం ఉద్యోగులు వారి విధులను సక్రమంగా చేసుకోవాలని, దేవాదాయ శాఖ పాలసీ విషయాలలో జోక్యం చేసుకోరాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
 ఈ తీర్పుననుసరించి ప్రస్తుత దేవాదాయ శాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు 2014, ఏప్రిల్ 22న విలీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం యాదగిరిగుట్టలో పాతగుట్ట విలీనం అయినట్టేనని  దేవస్థానం ఈఓ కృష్ణవేణి  ఉద్యోగులకు సమాచారం కూడా ఇచ్చారు.  కానీ ఈ ఆదేశాలను గుట్ట ఉద్యోగస్తులు తొక్కి పట్టి బయటికి రాకుండా చేశారు. అదే విధంగా ఉద్యోగులు ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు వద్దనుంచి ఈనెల 9న స్టే ఆర్డర్‌ను తీసుకువచ్చారు.  దీంతో రెండు దేవాలయాల తగాదా బహిరంగమైంది. ఆగ్రహించిన పాతగుట్ట ఉద్యోగులు ఆర్జిత సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఈఓ.. పాతగుట్టకు చెందిన 15మందికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. పాతగుట్టలో ప్రస్తుతం యాదగిరిగుట్ట ఉద్యోగులతో నిత్య కార్యక్రమాలు చేయిస్తున్నారు.

మరిన్ని వార్తలు