నేటి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు

4 Feb, 2020 02:32 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 10వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో 6వ తేదీన గురువారం ఉదయం 6 గంటలకు హవనం, అలంకార సేవ, సింహవాహన సేవ నిర్వహిస్తారు.

రాత్రి 8 గంటలకు స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. 7వ తేదీన ఉదయం 8 గంటలకు తిరుమంజనోత్సవం, హనుమంత వాహన సేవ నిర్వహించి, సాయంత్రం 8 గంటలకు స్వామి వారి తిరుకల్యాణోత్సవం జరిపిస్తారు. 8వ తేదీన ఉదయం హవనం, గరుడవాహన సేవ జరుగుతుంది. రాత్రి 8 గంటలకు స్వామి వారి రథోత్సవం, 9వ తేదీన ఉదయం 9.30 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు. 10వ తేదీన ఉదయం 10 గంటలకు స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు.  

మరిన్ని వార్తలు